28-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 28: గత ప్రభుత్వ హయాంలో కార్యకర్తలపై పెట్టిన కేసులను సాధ్యమైనంత త్వరగా ఎత్తి వేసేలా చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అండ.. దండ అని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో కేడర్‌ను ఉద్దేశించి పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. పార్టీలో నాయకులకు, కార్యకర్తలకు మధ్య వారధిలా తాను పని చేస్తానని స్పష్టం చేశారు. గతంలో కార్యకర్తలను నిర్లక్ష్యానికి గురి చేసేవారని.. ప్రస్తుతం అటువంటి పరిస్థితులు ఉండవన్నారు. పార్టీలో యువ కార్యకర్తలను ప్రోత్సహిస్తూ సీనియర్ల సహాయ సహకారాలతో తనకిచ్చిన బాధ్యతలను నెరవేరుస్తానని చెప్పారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయనన్నారు. తనపై టిడిపి గురుతరమైన బాధ్యత ఉంచిందని తెలిపారు. పార్టీ కార్యకర్తల సమస్యల్ని పరిష్కరించేందుకు కేంద్ర కార్యాలయంలో నిరంతరం ఓ మంత్రి అందుబాటులో ఉండే విధంగా కార్యాచరణ రూపొందిస్తానని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. 2024లో కార్యకర్తలు ఏ స్ఫూర్తితో పని చేశారో అదే స్ఫూర్తి 2029 ఎన్నికల వరకు కొనసాగుతుందని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టిన సందర్బంగా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జేబు దొంగలు హల్ చల్ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పలువురు నేతల డబ్బులు జేబు దొంగలు తస్కరించారు. సుమారు రెండు లక్షల రూపాయలకు పైగా జేబు దొంగలు తస్కరించినట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దొంగలను టీడీపీ కార్యాలయ సిబ్బంది గుర్తించారు. జేబు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జేబుదొంగల నుంచి సుమారు లక్ష రూపాయలకు పైగా డబ్బులను పోలీసులు గుర్తించారు.