29-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 29: ఆర్థికస్థితి వెక్కిరిస్తున్న వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై గురుతర బాధ్యతలు ఉన్నాయి. ఎన్నికల ముందు లేవనెత్తిన వివిధ సమస్యలను నెమరు వేసుకుని పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రధానంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సి ఉంది. ఉదార పథకాలను పక్కన పెట్టి బొక్కసం నిండుకునేలా మెల్లగా అడుగులు వేయాలి. అనేక పథకాలను సవిూక్షించి కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఆర్థిక క్రమశిక్షణ సాధ్యం కాదు. ఇందులో ప్రధానంగా ధరణి అక్రమాలను నిరోధించాలి. రైతుబంధును సరళీకరించాలి. చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే సాయం అందేలా చూడాలి. ఫామ్‌హౌజ్‌ల కోసం కొనుకున్న భూములకు రైతుబంధు అమలు చేయకుండా చూడాలి. కిలో రూపాయి బియ్యంపైనా సవిూక్షించాలి. మార్కెట్లో బియ్యం ధరలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో కిలో రూపాయి బియ్యం ఇవ్వడం దోచి పెట్టడమే తప్ప మరోటి కాదు. ఇబ్బడిముబ్బడిగా ఉన్న తెల్లకార్డులను తొలగించాలి. పేదరికంపై హేతుబద్దత ఆధారంగా ముందుకు సాగాలి. డబ్బుల పందేరం చేసే కార్యక్రమం లేదా పథకం ఏదైనా సవిూక్షించాల్సిందే.
ఎస్సీ కార్పోరేషన్ ను పునరుద్దరించి దళితులు స్వయంశక్తితో ఎదిగేందుకు వడ్డీరహిత రుణాలు ఇచ్చి వారిని ప్రోత్సహించాలి. అలాగే ఇబ్బడిముబ్బడిగా సలహాదారులను పెట్టే సంప్రదాయాన్ని పక్కన పెట్టాలి. వీటికి లక్షల్లో జీతాలు తగలేసి, ప్రభుత్వ ఖజానాను దివాళా తీయించడం మానుకోవాలి. ఇకపోతే విభజన సమస్యలపై కేంద్రంతో పోరాడి సాధించాలి. ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన హావిూలను పార్లమెంట్ వేదికగా నిలదీయడంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు ముందుండాలి. ఎపి విభజన జరిగాక ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి పెంచలేక పోయాయి. అందువల్ల కేంద్రం నిర్మాణా త్మక సహకారం అందించలేక పోయింది. ఎపి రాజధానిపై కేంద్రం చేతులెత్తేసింది. విశాఖ స్టీల్ ఆందోళనలను పట్టించుకోవడంలేదు. కడప ఉక్కును పక్కన పెట్టారు. బయ్యారం ఉక్కు ఊసే లేదు. ఇక ఏంచేశారో చెప్పడానికి ఏవిూ లేదు. ఉభయ రాష్ట్రాల మధ్య సమస్యలను పట్టించుకోలేదు. కృష్ణా, గోదావరి జలవివాదాన్ని కూడా సత్వరంగా పరిష్కరించాలన్న ఆలోచన చేయలేదు. విభజన సమస్యల పరిష్కారం పేరుతో కమిటీ వేసినా..విభజన హావిూలపై మాత్రం కేంద్రం నోరు మెదపడం లేదు.
దీనిపై ఈ రెండు రాష్టాల్రు నేరుగానే పోరాడాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. సమస్యలను నాన్చకుండా త్వరగా పోరాడితేనే మంచిది. స్థానిక బిజెపి నేతలు కూడా ఉభయ తెలుగు రాష్టాల్ల్రో సమస్యలు ప్రస్తావించి సాధించే తెలివిని ప్రదర్శించలేదు. దూకుడు రాజకీయాలతో, వారు చేస్తున్న విన్యాసాలు అభాసుపాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో గత విభజన సమయంలో ఇచ్చిన హావిూలను ముందుకేసి..అసలు కేంద్రం ఎందుకిలా వ్యవహరిస్తున్నదో నిలదీయాలి. విభజన హావిూలు అమలు చేయకుండా కేంద్రం రాష్టాన్రికి ద్రోహం చేసినా వైసిపి పెద్దగా పోరాడలేదు. మోడీ బురిడీ కొట్టించి కాలయాపన చేయడంతో పదేళ్లు గడిపేశారు. గతంలో దీర్ఘకాలం బిజెపితో టిడిపి సాగించిన పొత్తు రాజకీయాలు ఇప్పుడు అవకాశంగా తీసుకోవాలి. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నందున తగిన చొరవ తీసుకునేలా చంద్రబాబు కృషి చేయాలి. కృష్ణపట్నం జెన్‌కోను రాష్ట్ర ప్రభుత్వం అదానీకి ధారాదత్తం చేస్తున్నది. గంగవరం పోర్టును అప్పగించేశారు. సహకార చెక్కర, పాలసంఘాలను దెబ్బతీశాయి. ప్రత్యేకహోదాను పక్కనపెట్టి ఇద్దరూ కీచులాడుకున్నారు.
నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్‌డిఎ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినందున గతంలో లాగా దూకుడు ప్రదర్శించకపోవచ్చు. కాబట్టి ఇరు తెలుగు రాష్ట్రాల నేతలు ఉమ్మడిగా పోరాటం చేస్తే మంచిది. తెలుగు రాష్ట్రాల భవిష్యత్ ఏమిటన్నది ఉమ్మడిగా చర్చించాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి ఇక్కడి కాంగ్రెస్ గట్టిగా నిలదీయాల్సిందే. బిజెపి నేతలను కూడా నిలదీయాలి. లేకుంటే సమస్యలు సమస్యలుగానే ఉంటాయి.