29-06-2024 RJ
తెలంగాణ
నిజామాబాద్, జూన్ 29: ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి నేతలకు అవకాశం దొరికింది. ఇప్పటికే అంతా మళ్లీ పాతగూటికి చేరుతున్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేలా అడుగుల వేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో గత ఆరనెలలుగా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కార్యకలాపాలు పెరిగాయి. ఇప్పుడు కార్యకర్తలు కూడా ధైర్యంగా కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం, షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారు కావడంతో అనేక కార్యక్రమాలకు అవకాశం ఏర్పడిరది. జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి షబ్బీర్ అలీ ఇప్పటికే పలు కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. జిల్లాలో పార్టీ విస్తరణకు గల అవకాశాలను అందిపుచ్చు కుంటున్నారు. ప్రధానంగా జిల్లాలో పసుపు, ధాన్యం, ఎర్రజొన్న రైతుల సమస్యలపై పోరాడడం ద్వారా రైతుల్లో కొంత సానుభూతిని సాధించారు.
ఈ విషయాల్లో బిఆర్‌ఎస్, బిజెపిలు విఫలం అయ్యాయని షబ్బీర్ అలీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రైతు సంక్షేమానికి పెద్దపీట వేసామని అన్నారు. త్వరలోనే రుణమాఫీతో వారిలో మరింత భరోసా పెరగనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రైతులకు ఒకే దఫాలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్న హావిూకి అడుగు పడుతోంది. ఉపాధిహావిూ పథకాన్ని వ్యవసాయ అనుసంధానం, పంట బీమా, వరికి క్వింటాల్‌కు రూ.2500 చెల్లిస్తామన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే పసుపు రైతుల పోరాటానికి మద్దతుగా నిలిచి ఇక్కడి కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపారు. ఎన్నికల ఫలితాలు కూడా అనుకూలంగా రావడంతో ఇంతకాలం స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు నయాజోష్ వచ్చిందని షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో ఆర్మూర్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజీవ్ రైతు భరోసా దీక్ష విజయవంతమైంది.
ఆశావహులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీనికితోడు మాజీ ఎంపీ మధుయా ష్కీ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ల వల్ల అదనపు బలంగా మారింది. జిల్లా రాజకీయాల్లో వీరు కూడా తమవంతుగా ఉత్సాహం నింపుతున్నారు. మధుయాష్కీ నిజామాబాద్ పార్లమెంట్ నుంచి రెండు పర్యాయాలు ప్రాతినిథ్యం వహించారు. ఆయనకు అధినాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌గౌడ్‌తో నాయకులకు, కార్యకర్తలకు చనువు వుంది. ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి అందరితో సంబంధాలు ఉన్నాయి. మొత్తంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో క్రీయాశీలకంగా ఉండాలని చాలామంది ముందుకు వస్తున్నారని అన్నారు. గత మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. అనేక చోట్ల పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకలేదు.
కాంగ్రెస్‌కు నాయకత్వ కొరత ఉండడంతో అనేక మంది బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఆ పార్టీ టికెట్ కోసం పోటీ పడ్డారు. స్థానికంగా కాంగ్రెస్ నాయకులను పట్టించుకునే వారు లేకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఈ సమస్యలు ఇక ఉండవని షబ్బీర్ అభిప్రాయపడ్డారు. మెల్లగా పాతవారందరూ మళ్లీ కాంగ్రెస్ పార్టీ గూటికి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన వారికి ఇప్పుడు మళ్లీ అవకాశం వచ్చింది. మున్ముందు స్థానిక ఎన్నికలు ఉండడంతో పరిస్థితి మారుతోంది. స్థానిక ఎన్నికల్లో జిల్లాలో బలం చాటుతామని షబ్బీర్ అలీ కూడా ధీమాగా ఉన్నారు.