29-06-2024 RJ
తెలంగాణ
కొండగట్టు, జూన్ 29: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు ఆలయానికి తరలివచ్చారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలు దేరిన పవన్‌కు.. మార్గమధ్యలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. తుర్కపల్లి క్రాస్ రోడ్స్ వద్ద జనసేన నాయకులు గజమాలతో ఆయనను సత్కరించారు. పవన్ రాక నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి రోడ్డుమార్గంలో శనివారం ఉదయం ఆయన కొండగట్టుకు బయల్దేరారు.
ఈ సందర్భంగా ఆయనకు దారి పొడవునా అభిమానులు ఘనస్వాగతం పలికారు. ముందుగా హైదరాబాద్ శివారులోని తుర్కపల్లిలో పవన్ కల్యాణ్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చారు. తుర్కపల్లి నుంచి బయల్దేరిన తర్వాత సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి వద్ద కూడా జనసేన అధినేతకు ఘన స్వాగతం లభించింది. అక్కడ పవన్ కల్యాణ్‌ను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు అందించిన వీరఖడ్గంతో ఆయన ఫొటోలకు పోజులిచ్చారు. అనంతరం అభిమానులకు అభివాదం చేసుకుంటూ కొండగట్టుకు బయల్దేరి వచ్చారు. ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు.
11 రోజుల పాటు నిష్టతో ఈ దీక్షను పాటించనున్నారు. ఈ క్రమంలోనే తమ ఇలవేల్పు అయిన కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, గత ఏడాది ఎన్నికలకు ముందు ప్రచారం మొదలుపెట్టిన పవన్ కల్యాణ్.. తన వారాహి ప్రచార రథానికి కొండగట్టులోనే ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వారాహి విజయయాత్రను నిర్వహించారు.