29-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్.. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు.దీంతో బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి భౌతికకాయాన్ని తరలించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం నిజామాబాద్ పట్టణానికి తరలిస్తారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన సొంత నియోజకవర్గమైన ఇందూరు పట్టణంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు కూడా వెల్లడించారు.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం డీఎస్ భౌతిక కాయాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్‌కు తరలించున్నారు. డీఎస్ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తంచేశారు. మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. డీఎస్ భౌతికకాయానికి నివాళులర్పించారు. బిఆర్ఎస్ నేత కెటిఆర్, తదితరులు డిఎస్ ఇంటికి వెళ్లి నివాళి అర్పించారు.