29-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 29: డీఎస్ రాజకీయాలకు అతీతమైన వ్యక్తి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. డీఎస్ పార్ధివ దేహానికి ఆయన నివాళి అర్పించారు. మిత్రులు డి. శ్రీనివాస్ మృతి చెందారని తెలిసి చాలా బాధపడ్డానన్నారు. ఎంతో అనుభవం ఉన్న నాయకుడిని ప్రజలు కోల్పోయారననారు. ఆనాటి రాజకీయ నేతల్లో మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి డీఎస్ అని అన్నారు. ఏ మాత్రం గర్వం లేకుండా అందర్నీ కలుపుకుపోయేవారన్నారు. డీఎస్ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందన్న వెంకయ్యనాయుడు.. డీఎస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో ఉంచారు. ప్రస్తుతం ఆయనను చూసేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు.
సాయంత్రం ఆయన భౌతికకాయాన్ని నిజామాబాద్‌లోని ప్రగతినగర్‌లోని ఆయన నివాసానికి తరలించనున్నట్లు సమాచారం. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే.. డి.శ్రీనివాస్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. టీపీసీసీ తరుపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు నివాళులు అర్పించారు. డీఎస్ పార్థీవదేహంపైన కాంగ్రెస్ పార్టీ జెండా కప్పిన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులు నివాళులు అర్పించారు. నిజామాబాద్ కు డీఎస్ పార్థివదేహం తరలించనున్నట్లు సమాచారం. శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్ జిల్లాలో జన్మించాడు. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు.
1989లో కాంగ్రెస్ పార్టీ తరపున రంగంలోకి దిగి నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచి.. 1998లో ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. డీఎస్ అంత్యక్రియలు రేపు నిజామాబాద్‌లో అధికారిక లాంఛనాలతో జరపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారికి ఆదేశాలు జారీ చేశారు. డీఎస్ పార్థివ దేహాన్ని ఇవాళ సాయంత్రం నిజామాబాద్ లోని స్వగ్రామానికి తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని స్థలంలో అంత్యక్రియలు చేయనున్నారు.