29-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 29: తనపై, తన తోటి కమిటీ సభ్యులపై వచ్చింది కేవలం ఆరోపణలు మాత్రమేనని, తాము ఎటువంటి అవినీతికి పాల్పడలేదని డా॥ఎం. ప్రభాకర్‌రెడ్డి చిత్రపురి సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ అన్నారు. ఇలీవల సొసైటీలో అవినీతి ఆరోపణలతో జైలుకువెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చారు. శనివారం చిత్రపురి కాలనీలోని సొసైటీ ఆఫీస్ ఆవరణలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చిత్రపురికాలనీ అభివృద్ధి కోసం మా కమిటీ పగలు, రాత్రి చాలా కష్టపడింది.. పడుతుంది కూడా. అప్పులపాలు అయిపోయిన సొసైటీని బయట పడేయటానికి, సభ్యుల స్వంత ఇంటి కల నెరవేర్చటానికి మేం ఎంత కష్టపడ్డామో అందరికీ తెలుసు. కానీ కొందరు మెంబర్స్ కావాలనే మాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. వారందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి 4,600 మంది కుటుంబాలకు చెందిన సున్నితమైన సమస్య మనది. అనవసర వివాదాలుసృష్టించడం వల్ల వారందరి జీవితాలూ ప్రమాదంలో పడతాయి.
మేము ఎక్కడా అవినీతి చేయలేదు. మేం బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతా పారదర్శకంగానే వ్యవహరించాము. గత కమిటీలు తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగిన నష్టాలను, కష్టాలను కూడా మాకు అంటగడుతున్నారు. ప్రస్తుతం సొసైటీ 147 కోట్లరూపాయల డెఫ్‌షీట్‌లో ఉంది. సభ్యులు సకాలంలో సొమ్ములు చెల్లించక పోవడం వల్ల డెవలప్‌మెంట్ పనులు ఆగిపోతాయన్న భయంతో ఎస్.బి.ఐ నుంచి రుణాలు తీసుకుంది సొసైటీ. ఆ తర్వాత వాటిని తిరిగి కట్టలేని స్థితికి చేరుకుంది. ఆకారణంగా ఆక్షన్‌కు వెళుతుంటే కాపాడటానికి ఎంతప్రయత్నించామో అందరికీతెలిసిందే. చివరకు చదలవాడవారి సహకారంతో ఆ గండం నుంచి గట్టెక్కాము. లేకపోతే 67 ఎకరాల సింగిల్ బిట్‌గా ఉన్న సొసైటీ స్థలం ఏమయ్యేదో ఆలోచిస్తేనే భయం వేస్తుంది. కొందరుసభ్యుల ఫ్లాట్‌లను రద్దు చేసి, వేరే వారికి కేటాయించాము అంటున్నారు.
సొసైటీ బైలాను అనుసరించి గడువుతీరినా డబ్బులు చెల్లించని సభ్యులను ముందుగా నోటీసులు జారీ చేసి, ఆ తర్వాత మాత్రమే వారి ఆ చర్యలు తీసుకున్నాము. ఇది పూర్తిగా బైలా, చట్ట ప్రకారం తీసుకున్నదే. అలాగే సినిమా పరిశ్రమకు చెందని వారిని కూడా గుర్తించి చర్యలు తీసుకోవటం జరిగింది. ఇప్పటికే గత ప్రభుత్వం హయాంలో ‘51 ఎంక్వయిరీ’ కూడా వేశారు. మా పాలకవర్గం హయాంలో కేవలం 20 సభ్యత్వాలను మాత్రమే ఇచ్చాము. ట్విన్ టవర్స్ ప్రాజెక్ట్‌నుకూడా సొసైటీని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేయాలనే తపనతో చేపట్టిందే. ఇప్పటికి దానికి అప్లైచేసిన వారు 15మంది మాత్రమే. కానీ వందల కోట్ల అవినీతి జరిగింది అని ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి ప్రచారంవల్ల మన సొసైటీకే నష్టం జరుగుతుంది. ప్రస్తుతం సొసైటీ పరిస్థితి ఏం బాగోలేదు. 147 కోట్లరూపాయల డెఫ్‌షీట్‌లో ఉంది. ఇటువంటి తరుణంలో కేసులు, గొడవలు, ఆధిపత్య పోరు వంటి వాటితో కాలం గడిపితే 750 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్ట్‌ను, వేలాదిమంది సినీకార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసిన వారం అవుతాము.
అందుకే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. త్వరలో జనరల్‌బాడీ సమావేశం ఏర్పాటు చేస్తాం. అప్పుడు సభ్యులు తమకు నిజంగా అన్యాయం జరిగి ఉంటే ఆధారాలతో సహా వస్తే తగిన సమాధానం ఇస్తాను. అవసరం అయితే సొసైటీ క్షేమం కోసం సభ్యులు అంగీకారంతో పాలకవర్గం రద్దుకు కూడా నేను సిద్ధం. దయచేసి సభ్యులు అన్ని విషయాలను, వాస్తవాలను జనరల్‌బాడీ సమావేశంలో తెసుకునే అవకాశం ఉన్నందున ఆ సమావేశాన్ని తప్పని సరిగా హాజరు కావాల్సిందిగా కోరుతున్నా అన్నారు.