02-07-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూలై 2: రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే.. నేరగాళ్లకు కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడం తమ ప్రభుత్వం బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సంబంధించి 27 ఫోర్ వీలర్స్, 40 బైక్స్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 14 ఫోర్ వీలర్స్, 30 బైక్‌లను ప్రభుత్వం అందజేసింది. ఈ కొత్త వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చదువుకున్నవారు కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారని, సైబర్ నేరగాళ్ల ఫిర్యాదుకు 1930 టోల్ ఫ్రీనంబర్ ఏర్పాటు చేశామని, నేరగాళ్ల నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు రూ.31 కోట్లు రాబట్టారని, కొత్త నేర న్యాయ చట్టాలపై కూడా పోలీసులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని, హత్య, అత్యాచారం కన్నా ఈ కాలంలో సైబర్ నేరాలే పెద్దవిగా మారాయన్నారు.
మధ్యతరగతి, పేదలే సైబర్ నేరాలకు గురవుతున్నారని, విద్యార్థులు ఎక్కువగా గంజాయికి బానిసలుగా మారుతున్నారని, సమర్థత ప్రదర్శించిన అధికారులకు పదోన్నతులు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిది అని, మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య డ్రగ్స్, సైబర్ నేరాలు అని, డ్రగ్స్ నేరగాళ్లు తెలంగాణ నేలపై అడుగు పెట్టాలంటే భయపడాలని రేవంత్‌రెడ్డి తెలిపారు. చిరంజీవి ముందుకొచ్చి డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన వీడియో ఇచ్చారని, డ్రగ్స్‌పై పోరాడుతున్న చిరంజీవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని రేవంత్ ప్రశంసించారు. సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉందని, టికెట్లు ధరలు పెంచాలని సినీ పెద్దలు తమ దగ్గరకు వస్తున్నారన్నారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై సినీ పరిశ్రమ అవగాహన కల్పించడం లేదన్నారు. పోలీస్ వ్యవస్థకు కావాల్సిన నిధులు, అధికారులను కేటాయించామని తెలిపారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సైబర్ క్రైమ్.
నేరాలను ఎదుర్కోవడంలో రాష్ట్రంలో సైబర్ క్రైమ్ టీమ్ సమర్ధవంతంగా పని చేస్తోందన్నారు. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. డ్రగ్స్ మహమ్మారితో కుటుంబం, వ్యవస్థ నాశనమవుతాయి. దురదృష్టవశాత్తు గల్లీ గల్లీలో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగింది. ఈ క్రమంలో డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించాం. గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయి. చిన్నారులపై దాష్టీకం జరుగుతున్న ఘటనలకు కారణం మాదకద్రవ్యాలే. తెలంగాణ యువకులు డ్రగ్స్‌కు బానిసలు కాకుండా.. సమస్యలపై పోరాటం చేసే సమర్థులుగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ నియంత్రణలో సమర్ధవంతంగా పనిచేసినవారికి పదోన్నతి కల్పిస్తాం. ఇందుకు సంబంధించి శాసనసభలో చర్చించి చట్టాన్ని రూపొందిస్తాం. విూడియా.. రాజకీయ వివాదాలపై కాకుండా సమాజంలో సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇలాంటి కార్యక్రమాలపై ప్రజలకు వివరించాల్సిన బాధ్యత విూడియాపై ఉంది అని రేవంత్ పేర్కొన్నారు.
ఇదే సందర్భంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రీ షరతులు విధించారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్ పై సినిమాల్లో అవగాహన కల్పించాలన్నారు. వందల కోట్ల బ్జడెట్ సినిమా అయినా సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై సినిమాకు ముందు ప్రదర్శించాలన్నారు. సినిమా టికెట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారని.. కానీ వీటిపై అవగాహన కల్పించడం లేదని ముఖ్యమంత్రి తెలిపారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై సినిమాకు ముందు కానీ సినిమా తరువాత అయిన 3 నిమిషాలు వీడియోతో అవగాహన కల్పించాలని... అలా కల్పించకపోతే వారి సినిమాలకు టికెట్లు పెంచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అలాంటి నిర్మాతలకు, డైరెక్టర్‌లకు, తారాగణంకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవని తేల్చిచెప్పేశారు. సినిమా థియేటర్లు యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు.
డ్రగ్స్, సైబర్ నేరాలపై థియేటర్లలో ప్రసారం చేయకపోతే అలాంటి థియేటర్లకు అనుమతి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీవీ ఛానల్లు కూడా ఇలాంటి నేరాలపై అవగాహనకు సంబంధించిన ప్రకటనలు ప్రసారం చేయాలన్నారు. థియేటర్లలో డ్రగ్స్ నియంత్రణ కోసం ఉచితంగా వీడియో ప్రదర్శించాలని కోరారు. డ్రగ్స్ నిర్మూలనను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని.. డ్రగ్స్ నియంత్రణ కోసం చిరంజీవి వీడియో సందేశం పంపారని గుర్తుచేశారు. దేశంలోని యువత డ్రగ్స్ బారిన పడొద్దని అవగాహన కార్యక్రమంలో భాగమైనందుకు మెగాస్టార్ చిరంజీవిని అభినందిస్తున్నానని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణకు అలాంటి వాళ్లు చాలా మంది ముందుకు రావాలని.. సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్న సినిమా వాళ్లు, కొంతైనా తిరిగి ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని.. వాటి నియంత్రణకు కృషిచేయాలని కోరారు.