03-07-2024 RJ
సినీ స్క్రీన్
గతేడాది ’భగవంత్ కేసరి’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. వెంకటేష్‌తో ఆయనొక సినిమా చేయబోతున్నారనే వార్త చాలాకాలంగా హల్‌చల్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ’ఎఫ్2’, ’ఎఫ్3’ చిత్రాల తర్వాత వెంకటేశ్ తో అనిల్ పని చేస్తున్న చిత్రమిది. ఇందులో ఓ నాయికగా విూనాక్షి చౌదరిని ఇప్పటికే ఎంపిక చేశారు. తాజాగా మరో నాయిక పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్‌ని తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బాపట్ల జిల్లా శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ ను స్వామి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు.
అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ఆయన ప్రియురాలి పాత్రలో విూనాక్షి చౌదరి కనిపించనున్నారు. ఈ నెల 3 నుంచి చిత్రీకరణ మొదలుపెడతాం. నవంబరులో పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం‘ అని అన్నారు. ఎస్.వి.సి సంస్థలో వస్తున్నా 58వ చిత్రమిది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.