03-07-2024 RJ
తెలంగాణ
కరీంనగర్, జూలై 3: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ ఒకటో ఠాణాలో కేసు నమోదైంది. మంగళవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం కింద కేసు నమోదు చేశారు. భారత న్యాయ సంహిత సెక్షన్ 122, 126(2) కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు. జడ్పీ సమావేశం నుంచి తన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్తున్నారంటూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మంగళవారం అడ్డుకున్నారు. ఆమె వెళ్లే మార్గంలో నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జడ్పీ ఛైర్‌పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన జరిగిన చివరి సర్వసభ్య సమావేశానికి కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్, ఇతర అధికారులు హాజరయ్యారు.
జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలతోపాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గంలో మండల విద్యాధికారులతో ఎమ్మెల్యే హోదాలో తాను విద్యాశాఖ ప్రగతిపై సవిూక్ష నిర్వహించానని.. అందులో పాల్గొన్న ఎంఈవోలకు జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు మెమోలు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఎమ్మెల్యేతోపాటు భారాస జడ్పీటీసీలంతా డీఈవోను సస్పెండ్ చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీనిపై కలెక్టర్ సమాధానం చెప్పాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. సభలో ఆందోళన పెరుగుతుండడంతో కలెక్టర్ పమేలా సత్పతి తన కుర్చీలో నుంచి లేచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే ఆమె ఎదుట నేలపై బైఠాయించారు. కొద్దిసేపు పోలీసులకు ఆయనకు మధ్య వాగ్వాదం జరిగింది. కలెక్టర్ వెళ్లిన తర్వాత సభలో ఎమ్మెల్యే, కాంగ్రెస్ జడ్పీటీసీ సభ్యులు పరస్పర విమర్శలు చేసుకున్నారు.