03-07-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూలై 3: మహిళల కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. పోలీసులు కఠిన చర్యలు చేపట్టినా.. దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. మృగాళ్లు విజృంభిస్తూనే ఉన్నారు. తాజాగా మియాపూర్‌లో దారుణం జరిగింది. ఓ యువతిపై రియల్ ఎస్టేట్ సేల్స్ కంపెనీకి చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఉద్యోగం కోసం కడప నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆమె ఉప్పల్‌లో నివాసం ఉంటూ.. మియాపూర్‌లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా పనిచేస్తోంది. అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్‌లు యువతికి సైట్ చూపిస్తామంటూ కారులో తీసుకెళ్లారు. సైట్‌కు వెళ్లిన తర్వాత అక్కడ సంగారెడ్డి, జనార్దన్.. యువతిపై అత్యాచారానికి యత్నించారు. వారి బారి నుంచి తప్పించుకున్న యువతి, ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. జీరో ఎఫ్‌ఐఆర్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.... అక్కడి నుండి మియాపూర్‌కు కేసు బదిలీ చేశారు. సీఐ దుర్గ రామలింగ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.