03-07-2024 RJ
తెలంగాణ
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 3: మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు తమముందు ఎంతో ఆనందంగా ఉన్న వారు హఠాత్తుగా మరణిస్తుంటారు. అలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఎంతో శ్రద్ధగా చదువుకుంటున్న ఓ చిన్నారి.. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. భద్రాచలం సుభాష్‌నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసింది పెన్ను. చిన్నారి రియాన్షిక తలలో పెన్ను గుచ్చుకోవడంతో దుర్మరణం చెందింది. మంచంపై కూర్చొని రాసుకుంటున్న సమయంలో పాప ప్రమాదవశాత్తు కిందపడిరది. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ పెన్ను చిన్నారి కణితి వద్ద తలలో దిగింది. దీన్ని గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే పాపను భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. అయితే రియాన్షిక పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఖమ్మంకు తరలించారు. అయితే చికిత్స జరుగుతుండగా చిన్నారి కన్నుమూసింది. పాప రియాన్షిక అకాల మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కళ్ల ముందు ఆడుతూ తిరిగిన తమ చిన్నారి ఇక లేదని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు