03-07-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూలై 3: ప్రపంచంలోనే అతిపెద్ద భూ సేకరణ ప్రాజెక్టు అమరావతి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచం మెచ్చేలా రాజధాని నిర్మించాలని సంకల్పించి, అతిపెద్ద భూసేకరణ చేశామని, కానీ గత ఐదేళ్ల కాలంలో జగన్ దానిని విధ్వంసం చేశారని అన్నారు. ఇప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా పునర్నిర్మాణం చేసి తీరుతామని ప్రకటించారు. ఇది ఏ ఒక్కరి రాజధాని కాదు.. యావత్ రాష్ట్ర ప్రజలదని తెలిపారు. ప్రతి తెలుగు బిడ్డ అమరావతి నాది అని గర్వంగా గుర్తించాలి.. చెప్పుకోవాలన్నారు. కొత్తగా ప్రణాళికలు ఏవిూ లేవని, పాత వాటినే కొనసాగిస్తూ నిర్మాణం చేస్తామని తెలిపారు. రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఉద్యోగ, ఉపాధి కోసం తాను అమరావతిని నిర్మించాలని చూస్తే జగన్ విధ్వంసం సృష్టించారని పూర్తి విరవాలు ప్రకటించారు. జగన్ ప్రభుత్వం చేసిన అరాచక పనుల కారణంగా వరల్డ్ క్లాస్ క్యాపిటల్‌గా మారాల్సిన అమరావతి ఇప్పుడు దెబ్బతిన్నదన్నారు. అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఇప్పుడు ప్రజలు, పెట్టబడిదారుల విశ్వాసాన్ని పెంచుకుంటామన్నారు.
అమరావతి అనేది ఆ కాలంలో ప్రముఖ నగరం. రాష్ట్ర విభజన జరుగు తుందని, అమరావతి రాజధాని అవుతుందని ఎవరూ ఊహించలేదు. రాజధానికి అమరావతి పేరు పెట్టాలని రామోజీగ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు సూచించారు. అమరావతి పేరును క్యాబినెట్‌లో వందశాతం అంగీకరించారు. ప్రతి గ్రామం నుంచి మట్టి నీరు తెచ్చి అమరావతిలో ఉంచాం. యమునా నది నీరు, పార్లమెంట్ మట్టిని ప్రధాని మోదీ తెచ్చారు. దేశంలోని ప్రముఖ దేవాలయాల పవిత్ర జలం, మట్టి తెచ్చాం. ఆ పవిత్ర జలం, మట్టి మహిమ అమరావతిలో ఉంది. అందుకే అమరావతిని ఎవరూ కదిలించలేకపోయారు. రాష్ట్రంలో ఎటుచూసినా సమదూరంలో ఉన్న ప్రాంతం ఇది. రాష్ట్ర భవిష్యత్తును ఆకాక్షించే ఎవరైనా అమరావతిని ఒప్పుకోవాలి. విజయవాడ, గుంటూరు మధ్యే రాజధాని ఉండాలని శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పింది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవం నాకు ఉంది. తొమ్మిదేళ్లలో సైబరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం. కృష్ణానది నుంచి నీళ్లు తెచ్చి సైబరాబాద్‌కు ఇచ్చాం. 29 వేల మంది రైతులు 34,400 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారు.
రైతులు ఇచ్చిన భూమికి ఏటా పరిహారం ఇచ్చాం. పదేళ్ల వరకు పరిహారం ఇస్తామని రైతులకు చెప్పాం. రైతు కూలీలకు కూడా పరిహారం ఇచ్చాం. రైతులు ఇచ్చింది, ప్రభుత్వ భూమి కలిపి 53,745 ఎకరాలు సమకూరింది. రాజధాని రాష్ట్రానికి నడి మధ్యనే ఉండాలని ఆనాడు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పారు. కానీ, అధికారంలోకి వచ్చాక జగన్ ఏం చేశారో ప్రజలే చూశారు. దేశంలో ఏ నగరానికి లేని సౌలభ్యత అమరావతికి ఉంది. ఇన్ని కిలోవిూటర్ల రివర్ ఫ్రంట్ ఎక్కడా లేదు. ఒక వైపు గోదావరి, మరో వైపు కృష్ణా రెండు నదుల అనుసంధానంతో ఎప్పుడూ ఫ్రెష్ వాటర్ అందుబాటులో ఉంటుందని అన్నారు. విభజన సమయంలో మనకు లోటు బడ్జెట్‌ఉంది. ప్రాజెక్టు ఏదైనా విన్ విన్ పరిస్థితిలోనే ముందుకు తీసుకెళ్లా. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది ముందుకొచ్చారు. సింగపూర్.. మనకు మాస్టర్‌ప్లాన్ ఇచ్చింది. తొమ్మిది విభాగాల్లో అమరావతి హబ్‌గా మారాలని ఆకాంక్షించాం. ఫైనాన్షియల్, నాలెడ్జ్, టూరిజం, ఎలక్టాన్రిక్, హెల్త్ సిటీ ప్రతిపాదించాం. పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. దేశంలోని ఏ నగరానికీ అమరావతిలా సౌలభ్యం లేదు.
జగన్ వచ్చాక అమరావతిలో జరుగుతున్న పనులను ఆపేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చేశారు. ఏ కట్టడం కట్టాలన్నా పదిసార్లు ఆలోచిస్తాం. అమరాతి రైతులను అనేక రకాలుగా అవమానించారు. రాజధాని కోసం భూమి ఇచ్చిన రైతులు రోడ్డున పడ్డారు. శ్రీకాకుళం యాత్రకు వెళ్తే మధ్యలోనే అడ్డుకున్నారు. అమరావతి రైతుల త్యాగం చరిత్ర గుర్తు పెట్టుకుంటుందని అన్నారు. అమరావతి విధ్వంసం చేసి తెలుగు జాతికి ద్రోహం చేశారు. రాజధానిని మార్చిన వ్యక్తి గతంలో ఎవరూ లేరు. క్యాపిటల్ మార్పు జరిగితే ఏం జరుగుతుందో దేశానికిది కేస్ స్టడీ. ఇంతగా విధ్వంసం చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హుడేనా? కేసులు ఎదుర్కొంటున్న అమరావతి రైతులకు న్యాయం చేస్తాం. ఏం జరిగినా వెనక్కి చూడను.. ముందుకే వెళ్తా. న్యాయపరమైన చిక్కులు తొలగించి పనులు శరవేగంగా పూర్తి చేస్తాం. ఒకసారి నమ్మకం కోల్పోతే పెట్టుబడిదారులు మళ్లీ రారు. ఇప్పుడు పెట్టుబడి దారులను రప్పించాలంటే చాలా కష్టపడాలి. మళ్లీ ఇబ్బందులు రావని భరోసా ఏమిటని అడుగుతున్నారు? మన రాష్ట్రంలో అవకాశాలు లేవా.. ప్రజలకు తెలివితేటలు లేవా? మన రాష్ట్రం రైస్ బౌల్ అని దేశ వ్యాప్తంగా పేరుంది.
మనకు మంచి భూములు ఉన్నాయి.. పండిరచే రైతులు ఉన్నారు. అమరావతికి బ్రాండ్ ఇమేజ్ ఎలా తేవాలనే ఆలోచిస్తున్నాం. ఈ శిథిలాల నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతాం. ఇక్కడ సంపద సృష్టి, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన జరగాలి. అమరావతిలో పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. అంచెలంచెలుగా పూర్తి చేస్తాం అని చంద్రబాబు వివరించారు. చేపట్టిన ఏ ప్రాజెక్టు అయినా విన్`విన్ పద్ధతిలోనే ముందుకు సాగామని అమరావతిని కూడా అలాగే ప్రారంభించామన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన వారు కూడా సంతోషంగా ఉండాలన్నదే తన ఉద్దేశమన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మించిన సమయంలో అలాగే చేశామని అమరావతిలోనూ అదే విధంగా ల్యాండ్ పూలింగ్ నిర్వహించామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ అమరావతిదే అన్నారు. వరల్డ్ బ్యాంక్ దీనిని ఓ కేస్ స్టడీగా చూపించిందన్నారు. ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా రాజధానికి భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగేలా వ్యవహరించామన్నారు.
రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలని జగన్ ఆనాడు చెప్పారని... ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నారని... కానీ ఆ తర్వాత ఆయన ఏం చేశారో అందరూ చూశారని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి బ్యాంకులు ముందుకు వచ్చి.. మన రాజధాని ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చారన్నారు. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిందన్నారు. సింగపూర్‌తో ఎంవోయూ కూడా కుదుర్చుకున్నట్లు చప్పారు. సీడ్ క్యాపిటల్ ఏరియాతో పూర్తి వివరాలతో మాస్టర్ ప్లాన్ ఇచ్చినట్లు తెలిపారు. మొత్తం 9 నగరాలను అమరావతిలో ఏర్పాటు చేశామన్నారు. సెంటిమెంట్, పవిత్రమైన లక్ష్యంతో రాజధానిగా అమరావతి నిర్మాణం ప్రారంభిం చామన్నారు. భవిష్యత్ ను కాంక్షించే ఎవరూ రాజధానిగా అమరావతిని వ్యతిరేకించరని స్పష్టం చేశారు. కరుడుగట్టిన ఉగ్రవాది సైతం అమరావతికి ఒకే చెప్పి తీరాల్సిందేనని వ్యాఖ్యానించారు. రాజధానికి శంకుస్థాపన చేసిన సమయంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి నీరు, మట్టిని, దేశంలోని ప్రతి పుణ్యక్షేత్రం నుంచి నీరు, మట్టిని తీసుకువచ్చామన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాజధానిపై చర్చ జరగాలనే ఈ అంశంపై శ్వేతపత్రం విడుదల చేశామని చంద్రబాబు అన్నారు.
వైసీపీ నేతలు మట్టిని తవ్వారు కానీ అమరావతి మట్టిని మాత్రం తాకలేకపోయరని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసంపై చంద్రబాబు వీడియో ప్రదర్శించారు. 2019లో ఎక్కడ పనులు ఆగిపోయాయో.. 2024లో అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూపించారు. జరిగిన విధ్వంసం చూపించేటప్పుడు.. వాటి గురించి చెప్పేటప్పుడు చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు.