03-07-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూలై 3: విభజన సమస్యలపై ఇరు తెలుగు రాష్టాల్ర సిఎంల మధ్య భేటీ జరుగనుండడంతో ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 6న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ప్రజాభవన్ లో భేటీ కానున్న నేపథ్యంలో సమావేశ ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పరిశీలించారు. సిఎస్ శాంతి కుమారి, ఇతర అధికారులతో కలసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే చర్చించాల్సిన అంశాలపై నివేదికను సిఎస్ సిద్దం చేశారు.
భట్టితోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధ విభాగాల అధికారులు ప్రజా భవన్ ను సందర్శించారు. సజావుగా ఏర్పాట్లు చేయాలని ఆయా విభాగాల అధికారులకు ఆయన సూచనలు చేశారు. సమన్వయంతో సమావేశానికి తగు ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్య, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ వెంకట రావు ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.