04-07-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూలై 4: సైదాబాద్ పోలీస్ స్టేషన్లో దారుణ ఘటన వెలుగుచూసింది. న్యాయం చేయాలంటూ వెళ్లిన ఫిర్యాదుదారుడినే పోలీసులు చితకబాదారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో రాంసింగ్ కుటుంబం చిరువ్యాపారం చేసుకుంటూ నివాసం ఉంటోంది. రెండు నెలల క్రితం రాంసింగ్ భార్యకు పక్కింటి వాళ్లతో గొడవ జరిగింది. అదే రోజు రాత్రి ఆమె మృతి చెందింది. దీంతో తన భార్య మృతికి పక్కింటి వాళ్లే కారణమంటూ అతను పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో సాధారణ మృతిగా పోస్టుమార్టం నివేదిక వచ్చింది.
రిపోర్టుపై రాంసింగ్ బుధవారం రాత్రి సైదాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అతడిని చూసిన ఎస్సై సాయికృష్ణ ఓ గదిలోకి తీసుకువెళ్లి లైట్లు ఆపి సిబ్బందితో కలిసి చితకబాదాడు. తీవ్రంగా కొట్టి దుర్భాషలాడారు. విషయం తెలుసుకున్న బాధితుడి కుటుంబసభ్యులు పెద్దఎత్తున పీఎస్‌కు రావడంతో పోలీసులు సర్దిచెప్పి పంపించారు. తీవ్రగాయాలతో ఉన్న రాంసింగ్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రాంసింగ్ తనపై దాడి చేసిన ఎస్సై, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నాడు.