04-07-2024 RJ
తెలంగాణ
న్యూఢిల్లీ, జూలై 4: కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కే. కేశవరావుకు తగు విధంగా గౌరవం ఇస్తామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కెకె గురువారం రాజ్యసభకు రాజీనామా చేశారు.ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కేకే ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. తిరిగి సొంతగూటికి చేరిన కేకేతో భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేకే కు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా క్యాబినేట్ రాంక్ ఇస్తామని తెలిపారు. తెలంగాణాలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక పదేళ్లు పక్కా ఉంటుందని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉందని, రెండోసారి కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని అన్నారు. మూసీ అభివృద్ధి పై దృష్టి పెట్టామని.. ఈ ప్రాజెక్టు తన పేరు పై రికార్డుగా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు .
మూసి అభివృద్ధి, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రభుత్వ వ్యవహారంలో తప్పులకు ఆస్కారం ఇవ్వనని.. రూల్స్ ప్రకారమే ముందుకు పోతానని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావు సేవలను పార్టీ వినియోగించుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా చేయడంపై సీఎం స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ఏది మంచిదో అదే నిర్ణయం కేకే తీసుకున్నారన్నారు. తాను కాంగ్రెస్ మనిషినని, కాంగ్రెస్ తన సొంత ఇల్లు అని ఈ సందర్భంగా కేకే వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఎంపీలతోనే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణలో ప్రస్తుతం పాలన ప్రజాస్వామ్య బద్ధంగా ఉందన్నారు. ఆరు నెలల్లో ఎవరినీ అంచనా వేయలేమన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న వారు ఫ్యామిలీ పబ్లిసిటీ చేశారని విమర్శించారు. భారాస రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందునే నైతిక విలువలతో రాజీనామా చేసినట్టు చెప్పారు. రాజ్యసభ ఛైర్మన్‌కు కూడా ఇదే విషయం చెప్పానని తెలిపారు.