05-07-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూలై 5: బీజేపీ మూల సిద్దాంతాలకు భిన్నంగా భారత రాజకీయాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో మోడీ ద్వయం ఎప్పటికప్పుడు అవసరమైన ఎత్తులు వేస్తున్నారు. రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలంతా బిజెపి వైపు ఆకర్శితులు అయ్యేలా చేసుకోగలుగుతున్నారు. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టగలిగే సమర్థులను వెదుకుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు తెలంగాణలో కొత్త అధ్యక్షుడి ఎంపిక జరగాల్సి ఉంది. ఎపిలో ఎంపిగా పురందేశ్వరి గెలుపొంది నందున ఆమెకు ఏదైనా కీలక పదవి అప్పగించే పరిస్థితి ఉందని అంటున్నారు. అలా జరిగితే ఇరు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల అసవరం ఏర్పడుతుంది. లేకుంటే తెలంగాణకు మాత్రం నియామకం తప్పదు. తెలుగు రాష్ట్రాల్లో బిజెపి కొత్త అధ్యక్షుల నియామకం కేవలం ఆషామాషీగా చూడడం లేదు. బండి సంజయ్ అధ్యక్షుడిగా వచ్చిన తరవాతనే బిజెపి క్షేత్రస్థాయిలో వేళ్లూనుకుంది.
ఇక్కడ పార్టీని బలోపేతం చేయడంలో బండి సంజయ్ పడ్డ కష్టం మరెవరూ గతంలో పడివుండరు. ఎపిలో సోము వీర్రాజు కూడా కొంత దూకుడు ప్రభావం కలసి వచ్చింది. ఈ ఇద్దరినీ మార్చాక ఇప్పుడు మళ్లీ కొత్తవారిని తీసుకోక తప్పడం లేదు. తెలంగాణలో కవితకు, కెసిఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా బండి సంజయ్ తెగించి పోరాడాడు. ఎన్నికల సమయంలో పార్టీని బలోపేతం చేసిన వ్యక్తిని కాకుండా గతంలో పనిచేసిన కిషన్ రెడ్డిన నియమించడంలో ఔచిత్యం ఏవిూ లేదు. కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా చూసేలా బిఆర్‌ఎస్, బిజెపిల మధ్య లోపాయకారి అవగాహన జరిగిందన్న ప్రచారం సాగింది. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి.. తెలంగాణ ప్రజలు కూడా ఆ తరహా డబుల్ ఇంజన్ సర్కారును కోరుకుంటున్నారనే ప్రచారం బండి సంజయ్ బాగా ముందుకు తీసుకుని వెళ్లారు. గ్రామాల్లో కూడా కమలదళం జెండాలు ఎగిరాయి.
బండిని తప్పించరని భావించినా అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. ఎందుకిలా జరిగిందన్న తర్జనభర్జనల తరవాత కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయ్యారు. ఆయన కేంద్రమంత్రి కావడంతో ఇప్పుడు మరోమారు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాల్సి ఉంది. అయితే బిజెపిలో పోటీ బాగా ఉంది. డికె అరుణ, దర్మపురి అర్వింద్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, రామచంద్రరావు తదితరులంతా పోటీ పడుతున్నారు. రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారివి. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీనైనా చీల్చడమో, లొంగదీసుకోవడమో చేయగలిగిన శక్తి మోదీకి ఉన్నదని గత పరిణామాలు నిరూపిస్తున్నాయి. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే దేశంలో మోడీ మార్క్ రాజకీయాలు చూస్తుంటే నిజమే కావచ్చన్న అభిప్రాయం కలగక మానదు. తెలంగాణలో 8 పార్లమెంట్ సీట్లు రావడం, బిఆర్‌ఎస్ క్రమంగా బలహీన పడడంతో ఇప్పుడు సమర్థుడైన వ్యక్తిని అధ్యక్షుడిని చేయాల్సి ఉంది. అందుకే బిజెపి ఆచాఇతూచి అడుగులు వేస్తోంది.