05-07-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జూలై 5: భారత దేశపు అత్యున్నత సాహితీ పురస్కారం ’జ్ఞానపీఠ అవార్డు‘ అందుకున్న మూడవ తెలుగు సాహిత్య దిగ్గజం డాక్టర్ రావూరి భరద్వాజ. ఆయన కలం నుండి జాలువారిన అద్భుత సంచలన నవల ’పాకుడు రాళ్ళు’ ఏప్రిల్ 17, 2013న ఈయనకు ప్రకటించబడ్డ జ్ఞాన్‌పీఠ్ అవార్డు తెలుగు సాహిత్యానికే గర్వకారణం. విశ్వనాథ సత్యనారాయణ, సి.నారాయణరెడ్డిల సరసన ఇతన్ని ఈ అవార్డు చేర్చిననూ రచనా ప్రపంచంలో ఇతని శైలి మాత్రం అంతకంటె గొప్పది. ’జ్ఞానపీఠ అవార్డు‘ గ్రహీత రావూరి భరద్వాజ 1927 జూలై 5వ తేదీన కృష్ణా జిల్లా లోని నందిగామ తాలూకా కంచికచర్ల సవిూపంలోని మోగులూరు గ్రామంలో రావూరి కోటయ్య, మల్లికాంబ దంపతులకు జన్మించారు. వీరి విద్యాభ్యాసం 8వ తరగతి వరకే సాగింది. వీరిది దేశభక్తుల కుటుంబం. తండ్రి స్వాతంత్య సంగ్రామంలో పాల్గొన్నారు. పేదరికంతో చినిగిన బట్టలు వేసుకున్నందుకు తరగతి గదిలో జరిగిన అవమానాల కారణంగా 8వ తరగతి అభ్యసిస్తున్నప్పుడు మధ్యలోనే చదుపు ఆపివేశారు. బతుకు పోరాటం కోసం కూలీగా పనిచేశారు. తిండి కోసం సైన్యంలో చేరారు.
1948లో వివాహం అనంతరం తెనాలి చేరి అక్కడ ఒక ప్రెస్సులో పనిచేశారు. కొన్నాళ్ళ తర్వాత ఒక పత్రికకు ఉపసంపాద కుడుగా పనిచేశారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్ళు ఒక కంపెనీలో సేల్స్‌మన్‌గా, ఆ తర్వాత హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో కళాకారునిగా చేరినారు.పేదరికం నుంచి జ్ఞానపీఠ్ అవార్డు వరకు అతను సాగించిన జీవన సమరం ఎన్నో మలుపులు తిరిగింది.భరద్వాజ తన తొలి కథను 16 ఏళ్ల ప్రాయంలో వ్రాశారు. ఇది జానపద శైలిలోసాగే కథ. భరద్వాజపై చలం ప్రభావం అధికంగా ఉన్నది. చిన్నప్పుడు తాను పడ్డ కష్టాలు, బాధలు రావూరి రచనల్లో ప్రస్పుటంగా కనిపిస్తాయి. ఆయన రచనలో సాహిత్యమే కాదు, సాంఘిక విలువలూ కనిపిస్తాయి. రావూరి భరద్వాజను నిలబెట్టే రచనల్లో అతి ముఖ్యమైనది పాకుడురాళ్లు నవల.