05-07-2024 RJ
సినీ స్క్రీన్
ప్రముఖ నటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ’భారతీయుడు 2’సినిమా ’భారతీయుడు’కు సీక్వెల్‌గా వస్తోంది. తాజాగా ఈ యాక్షన్ థ్రిల్లర్ సెన్సార్ పూర్తి చేసుకుంది. కొన్ని సూచనలు ఇస్తూ సెన్సార్ బోర్డు దీనికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ’భారతీయుడు 2’ రన్‌టైమ్ ఏకంగా 3.04 గంటలు ఉంది. కొన్ని సన్నివేశాల్లో ఉపయోగించిన పదాలను మ్యూట్ చేయాలని సెన్సార్ బోర్డ్ చిత్రబృందాన్ని సూచించింది. ఇంత నిడివి ఉన్న చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే అందుకు తగిన కథ, కథనాలు ఉండాలి. అయితే శంకర్ ఈ విషయంలో పూర్తి విశ్వాసంతో ఉన్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ అన్ని సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయన్నారు. జులై 12న ఈ సినిమా విడుదల కానుంది.
ఇటీవల వచ్చిన ’యానిమల్’, ’సలార్’, ’కల్కి 2898 ఏడీ’ చిత్రాలు మూడు గంటలకు పైగా రన్‌టైమ్‌తో విడుదలయ్యాయి. ఇప్పుడు వీటి జాబితాలో కమల్ హాసన్ ’భారతీయుడు 2’ చేరింది. ఆ సినిమాలన్నీ విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇప్పటికే ’భారతీయుడు 2’పై భారీ అంచనాలున్న నేపథ్యంలో ఈ చిత్రం కూడా మంచి వసూళ్లు సాధించడం ఖాయమని సినీప్రియులు అభిప్రాయ పడుతున్నారు. ’భారతీయుడు’ 1996లో శంకర్ దర్శకత్వంలో వచ్చి సంచలనం సృష్టించింది. సేనాపతి పాత్రలో కమల్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ’భారతీయుడు 2’ మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమైంది. అవినీతిపై ఉద్దం చేసే లక్ష్యంతో చిత్ర కథ నడవనుంది.