05-07-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూలై 5: అరుదైన ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్రచందనం డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 158 దుంగలు దొరికాయని, వాటి విలువ రూ.1.6కోట్లు ఉంటుందని అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. శేషాచలం అడవుల్లో నరికేసిన ఎర్రచందనం దుంగలను ఎక్కడెక్కడ దాచారో గుర్తించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
ఎర్రచందనం స్మగ్లర్ల నెట్‌వర్క్‌ను నడిపిస్తున్న సూత్రధారులను పట్టుకోవాలని నిర్దేశిరచారు. రవాణా దశలో, దాచి ఉంచిన దగ్గరో పట్టుకోవడంతో పాటు ఎర్రచందనం కూలీలు, రవాణా దారులను తెరవెనుక ఉండి నడిపిస్తున్నవాళ్లను గుర్తించి అరెస్టు చేయాలన్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలపై చర్చించారు. నమోదైన కేసుల్లో ఎన్నింటిలో శిక్షలు పడ్డాయో, ఎన్ని కేసులు వీగిపోయాయో వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాలు, నేపాల్‌లో పట్టుబడ్డ కేసుల్లో అక్కడ ఉండిపోయిన ఎర్రచందనం దుంగలను తిరిగి తెచ్చుకోవడంపైనా దృష్టి పెట్టాలన్నారు.