05-07-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూలై 5: ఆషాడ మాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరంలో బోనాల సందడి మొదలవుతుంది. అమ్మ బైలెల్లినాదే అంటూ అమ్మవారికి భక్తులు చీర, సారెలు, నైవేద్యాలతో బోనాలు సమర్పిస్తుంటారు. ప్రతీ ఏడాది లాగే ఈ సారి కూడా హైదరాబాద్‌లో బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల జాతర షురూ అవుతుంది. ఈనెల 7వ తేదీ ఆదివారం నుంచి గోల్కొండ ఖిల్లా నుంచి జాతర ప్రారంభంకానుంది. ఇప్పటికే బోనాల పండుగ కోసం పెద్ద ఎత్తున సర్కార్ ఏర్పాట్లు చేసింది. గోల్కొండ నుండే రాష్ట్రవ్యాప్తంగా బోనాల పండుగ మొదలవుతుంది.
గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపు ఒక్కరోజే సమయం ఉండడంతో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు? పూర్తి అయ్యాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని శాఖల సవిూక్షతో భారీ ఏర్పాట్లు జరిగాయి. గోల్కొండ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ మహాకాళి బోనాలను నిర్వహించడం జరుగుతుంది. ఆషాఢ మాసం చివరి రోజున తిరిగి గోల్కొండ కోటలో చివరి బోనంతో పూజలు చేసి ఉత్సవాలను ముగింపు పలుకుతారు.