05-07-2024 RJ
తెలంగాణ
అచ్చంపేట, జూలై 5: దేశంలోని టూరిస్ట్‌లను ఆకర్షించే విధంగా నల్లమల అడవులను అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నల్లమలలోని పర్యాటక ప్రాంతాలను గుర్తించేందుకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి దామోదర్ రాజనర్సింహ తో కలిసి కృష్ణారావు ఇవాళ అచ్చంపేట నుంచి బయలుదేరారు. ముందుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉమామహేశ్వరం ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి మొదటి విడతగా రూ. 50 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
శ్రీశైలం వెళ్లే భక్తులు ఉమామహేశ్వరం వచ్చే విధంగా ప్రధాన రహదారిపై బోర్డులను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెండు రోజులపాటు నల్లమలలో పర్యటించి పురాతన ఆలయాలతో పాటు టూరిజం పరంగా అభివృద్ధి చేసే ప్రాంతాలను పరిశీలిస్తామన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చడంతో పాటు ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అనంతరం రంగాపూర్ నిరంజన్ షావలి దర్గాను మంత్రులు, ఎమ్మెల్యేలు దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.