06-07-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూలై 6: విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు సాగిన భేటీలో పది కీలక అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యంగా ఇరు రాష్టాల్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారుల సూచనలు తీసుకున్నారు. న్యాయపరమైన చిక్కులపై కూడా చర్చించారు. షెడ్యూల్ 10లోని అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరించుకోవాలనే ఏకాభిప్రాయానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినట్టు తెలిసింది.తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బి.సి. జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర అధికారులు హాజరయ్యారు. ప్రధానంగా చర్చించిన అంశాల్లో ఇవి ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు. విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు. పెండింగ్ విద్యుత్తు బిల్లులు, విదేశీ రుణసాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించారు. వాటి అప్పుల పంపకాలు. ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపులు. హైదరాబాద్‌లో ఉన్న మూడు భవనాలు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించే అంశం. లేబర్ సెస్ పంపకాలు. ఉద్యోగుల విభజన అంశాలు చర్చకు వచ్చాయి. మంత్రుల, అధికారుల కమిటీ వీటిపై చర్చించనుంది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది.
రేవంత్ ఎలా ఉన్నావంటూ చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. కొద్దిసేపు ఇద్దరు నేతలు మాట్లాడుకున్న తర్వాత సమావేశం ప్రారంభమైంది. ప్రస్తుతం అధికారుల సమక్షంలో విభజన చట్టంలో అంశాలు, ఆస్తుల పంపకంపై చర్చించారు. ఇద్దరు సీఎంల భేటీలో దీర్ఘకాలంగా పరిష్కారం కానీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఏపీ కొన్ని డిమాండ్లను తెలంగాణ ప్రభుత్వం ముందు పెట్టగా.. తెలంగాణ కొన్ని డిమాండ్లను ఏపీ ప్రభుత్వం ముందు పెడుతోంది. కొన్ని అంశాల్లో మాత్రం ఏకాభిప్రాయం వచ్చే అవకాశం కనిపించడం లేదు. ముఖ్యంగా విలీన గ్రామాల విషయంలో చర్చించినట్లు తెలుస్తోది. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడటానికి ముందు భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టుకు ఎటువంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఏడు మండలాలను ఏపీలో కలపాలని చంద్రబాబునాయుడు కోరగా.. కేందప్రభుత్వం సుముఖంగా స్పందించి.. ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసింది.
ఆ నిర్ణయాన్ని అప్పటి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కూడా విలీన మండలాలను తెలంగాణలో కలపాలని కోరుతోంది. ఇది పక్కనపెడితే మిగిలిన అంశాల్లో ఎక్కువ అంశాలకు ఈ సమావేశంలో పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఈక్రమంలో ఆర్థికపరమైన అంశాలపై ఏవిధమైన చర్చ జరుగు తుందనేది ఆసక్తిగా మారింది.వీటితో పాలు ఏపీ, తెలంగాణ మధ్య వివాదం నెలకొన్న విద్యుత్ బకాయిల అంశంపై మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి చంద్రబాబు, రేవంత్ రెడ్డి చర్చించారు. పదేళ్లుగా పరిష్కారం కాని విభజన హావిూలు, ఆస్తుల పంపకానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రజా భవన్‌లో సమవేశమైన తెలుగు రాష్టాల్ర సీఎంలు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. మరోసారి భేటీ కావాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు. ప్రధానంగా భద్రాచలం నుండి ఏపీలో కలిపిన ఏడు మండలాల్లోని 5 గ్రామాలను తమకు తిరిగి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
ఈ విషయంలో చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. భద్రాచలం పట్టణానికి అనుకుని ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం పంచాయతీలను.. తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్ ఎప్పటి నుండో వినిపిస్తుంది. ఈ గ్రామాల విలీనంతో భద్రాచలం పట్టణ అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెబుతోంది. అయితే ఓ రాష్ట్రంలోని గ్రామాలను వేరే రాష్ట్రంలో కలపాలంటే.. కేంద్ర అనుమతి తప్పనిసరి. కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రజాభవన్ భేటీలో విభజన సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ ఖరారు చేశారు ఇరువురు ముఖ్యమంత్రులు. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడకుండా ఉమ్మడి అజెండాపై కలిసిపని చేయాలని రెండు రాష్టాల్రు మొదటి నుంచి భావిస్తున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఉమ్మడిగా ప్రయత్నిం చాలని, ఎగువ రాష్టాల్రతో నీటి వాటాలపై కలిసి పోరాడేలా ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు.
ఉమ్మడి ఏపీ విభజన జరిగి పదేళ్లు పూర్తయినా కూడా.. అనేక కీలకాంశాలు ఇంకా పెండిరగ్‌లో ఉండిపోయాయి. అధికారుల స్థాయిలో కొన్నిసార్లు చర్చలు జరిగినా చాలా విషయాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా ఉమ్మడిగా తొమ్మిది ఎజెండా అంశాలను ఖరారు చేశారు. ఈ ఎజెండాలో రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు, విభజన చట్టంలో చేర్చని సంస్థల ఆస్తుల పంపకాలు, ఏపీ ఫైనాన్సియల్ కార్పొరేషన్ అంశాలు, పెండిరగ్ విద్యుత్తు బిల్లులు, విదేశీ రుణ సాయంతో నిర్మించిన ప్రాజెక్టుల ఆస్తులు, అప్పుల పంపకాలు, ఉమ్మడి సంస్థలకు చేసిన చెల్లింపులు, లేబర్ సెస్ పంపకాలు, ఉద్యోగుల విభజన అంశాలపై చర్చించారు.