09-07-2024 RJ
తెలంగాణ
మహబూబ్‌నగర్, జూలై 9: వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ కలెక్టరేట్ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొక్కలు నాటారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సిఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జిల్లాలో మొత్తం 396.09 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా రూ.353.66 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎంవిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.10 కోట్లతో బాలికల హాస్టల్ నిర్మాణం, దేవరకద్రలో రూ.6.10కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం, మహబూబ్ నగర్ రూరల్ లో రూ.3.25 కోట్లతో కెజివిబి భవన నిర్మాణం, గండీడ్ లో రూ.6.20 కోట్లతో కెజివిబి భవన నిర్మాణం, పాలమూరు యూనివర్సిటీలో రూ.13.44 కోట్లతో టిపి, అకాడామిక్ బ్లాక్, గ్యాలరీ పనులు, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో రూ.37.87 కోట్లతో సిసి రోడ్లు, స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో రూ.276.80 కోట్లతో ఎస్ టిపి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
పాలమూరు యూనివర్సిటీలో రూ.42.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, చిన్నారెడ్డి, ఎంపి మల్లు రవి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం మహబూబ్‌నగర్ కలెక్టర్‌లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సవిూక్ష నిర్వహించారు. 2025 డిసెంబర్‌లోపు కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పరిశీలించి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. గ్రీన్ ఛానెల్ ద్వారా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి నెలా ప్రాజెక్టు పనుల్లో పురోగతిపై సవిూక్ష నిర్వహించాలని నిర్ణయించారు.