09-07-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూలై 9: ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ మహిళలకు ఇంత అన్యాయం జరగలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ధర్నాచౌక్ వద్ద భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత భాజపాదేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేని అనేక హావిూలు ఇచ్చిందని విమర్శించారు. మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఇస్తామన్న రేవంత్ ప్రభుత్వం.. వారికి రూ.20 వేల బాకీ ఉందని తెలిపారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. ‘కల్యాణలక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు.. ఇవ్వలేదు. మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చి.. బస్సులు తగ్గించారు. తెలంగాణ ఆడబిడ్డల తరఫున ప్రశ్నించే బాధ్యత మేం తీసుకున్నాం. హావిూల అమలు కోసం సీఎంపై ఒత్తిడి తెస్తాం.
కర్ణాటకలో కూడా హావిూలు అమలు చేయట్లేదు. రాష్ట్రంలో ఆర్‌ఆర్ ట్యాక్స్ విధిస్తున్నారు. రాహుల్ గాంధీ పర్యటనల కోసం పన్నులు ఉపయోగిస్తున్నారు. హావిూలు ఎప్పటి నుంచి అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నా. పథకాల పేరుతో తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారు? మహిళలపై సీఎంకు గౌరవం ఉంటే బెల్ట్ షాపులు మూయించాలి. రాష్ట్రం ఏర్పాటై పదేళ్లయినా కొత్త రేషన్‌కార్డులు ఇవ్వలేదు. దీంతో మహిళలు గ్యాస్ కనెక్షన్లు తీసుకోలేకపోతున్నారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటని, తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రధాని మోదీ 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు.