09-07-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూలై 9: కొందరు గత ఐదేళ్లలో కొట్టేసిన సొమ్ముతో వ్యవస్థను కొనుగోలు చేయాలని చూస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. వీరి అవినీతిని అరికట్టాలంటే రూ.500, రూ.200 నోట్లు రద్దు చేసి డిజిటల్ కరెన్సీ తీసుకురావాలని చంద్రబాబు కోరారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. దేశం నుంచి నల్లధనాన్ని ఏరివేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. మోదీ ప్రభుత్వం 2016లో రూ. 500, 1000 నోట్లను ఉపసంహరించుకుంది. దాంతో ఏర్పడ్డ కరెన్సీ కొరతను తీర్చడానికి రూ.2000 నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆ తర్వాత వాటినీ కూడా రద్దు చేసింది. కాగా.. నోట్ల రద్దు గురించి తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎస్ఎల్బీసీ సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.. ఈ సమావేశంలోనే 2024`25 సంవత్సరానికి గానూ రూ.5.4లక్షల కోట్లతో రుణ ప్రణాళికను ఎస్ఎల్బీసీ విడుదల చేసింది. అందులో రూ.3.75లక్షల కోట్లు ప్రాధాన్య రంగాలకు కేటాయించారు. రూ.1.65లక్షల కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణప్రణాళికను రూపొందించారు. వ్యవసాయ రంగానికి రూ. 2.64లక్షల కోట్లు రుణాల ఇవ్వడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఇది గతంలో కంటే 14 శాతం ఎక్కువని అధికారులు తెలిపారు. వ్యవసాయ రంగంలో మౌలిక వసతులకు రూ.32,600 కోట్ల రుణాలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే, డెయిరీ, పౌల్టీ, ఫిషరీస్, సాగులో యాంత్రీకరణ, మౌలిక వసతులకు రుణాల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు.