09-07-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూలై 9: భోగాపురం విమానాశ్రయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. మంగళవారం ఎయిర్ పోర్టు ప్రాంతాన్ని మంత్రి పరిశీలించిన అనంతరం విూడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు కావాలన్నా వెంటనే వచ్చేలా చేస్తామన్నారు. ఉత్తరాంధ్రకు విమానాశ్రయ అనుసంధానం చాలా అవసరమన్నారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలోగా పూర్తి చేస్తామన్నారు. దేశంలోనే నెంబర్‌వన్ విమానాశ్రయంగా భోగాపురం ఉండాలని కోరామన్నారు. విమానాశ్రయం ప్రణాళికలోనే 2,700 ఎకరాలు ఉంది. 500 ఎకరాలు తగ్గించేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించింది. విమానాశ్రయం పనులను గత ప్రభుత్వం ఆలస్యం చేసింది. డిసెంబరు నాటికి టెర్మినల్ భవనం పూర్తి చేస్తాం. 2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు పూర్తవుతాయి. చిన్న చిన్న సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తాం. విమానాశ్రయం పూర్తయితే సుమారు 6లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.
దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలవారు కూడా ఇక్కడికే వస్తారు విశాఖ విమానాశ్రయం నుంచి ఏటా 28 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. అంతర్జాతీయ టెర్మినల్, రన్‌వే, ఎంఆర్‌వో నిర్మిస్తున్నాం. విమానాశ్రయాన్ని అన్ని వైపులా రహదారులతో అనుసంధానం చేస్తున్నాం. బీచ్ హైవే ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం అని మంత్రి వివరించారు. ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఎమ్మెల్యేలు నాగమాధవి, అదితి గజపతిరాజు తదితరులు మంత్రి రామ్మోహన్ నాయుడు వెంట ఉన్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు జిల్లా కలెక్టర్ డా. బి ఆర్ అంబేద్కర్ వివరించారు. జిల్లా ఉన్నతాధికారులతోపాటు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సైతం పాల్గొన్నారు.