09-07-2024 RJ
ఆంధ్రప్రదేశ్
భీమవరం, జూలై 9: రాష్ట్రానికి గతంలో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే.. వాటిని జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా భీమవరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినియోగించిన నిధులకు ఖచ్చితమైన లెక్కలు అయితే లేవని మండిపడ్డారు. అయితే గత జగన్ ప్రభుత్వం నిధుల దుర్వినియోగంపై విచారణ జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అబివృద్ది కోసం కేంద్రం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌పై కేంద్ర మంత్రులకు మంచి నమ్మకముందని తెలిపారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్, ఆంధ్రుల హక్కు అయిన.. విశాఖ ఉక్కు అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసరాజు స్పష్టం చేశారు.