10-07-2024 RJ
తెలంగాణ
ఖమ్మం, జూలై 10: వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అందజేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హావిూ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హావిూని అమలు చేయడం కోసం తమ ప్రజా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్‌లో నిర్వహించిన రైతు భరోసా పథకం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిందన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పారు. రైతుభరోసా పథకం అమలు కోసం ఉమ్మడి పది జిల్లాల్లో పర్యటించి ప్రజలు, రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి విధివిధానాలు రూపొందించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలో రైతు భరోసా అమలుపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. జిల్లాల వారీగా అనేక మంది నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో మంత్రుల బృందం పర్యటించింది.
ఈ జిల్లాల పర్యటన ముగిసిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అందులో భాగంగానే జూలై 10 ఖమ్మం, 11న అదిలాబాద్, 12న మహబూబ్ నగర్, 15న వరంగల్, 16న సంగారెడ్డి(మెదక్), 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23న రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయాల్లో రైతుల నుంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నట్లు షెడ్యూల్‌ను రూపొందించారు. రైతుభరోసాపై విధివిధానాల ఖరారు కోసం రైతు సంఘాలు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అన్నిజిల్లాలో అభిప్రాయాలు సేకరించి, త్వరలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా స్పందించారు. గత ప్రభుత్వం ఏ స్కీమ్ చేపట్టినా ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదన్నారు. నాలుగు గోడల మధ్య నిర్ణయం తీసుకుని ప్రజలపై రుద్దారన్నారు. ప్రభుత్వానికి వచ్చే ప్రతీపైసా ప్రజల నుంచి వచ్చిందేనని, రైతులు ఇచ్చే సూచనలపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైతుల ఆలోచన మేరకే ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
రైతుల అభిప్రాయం తీసుకున్నాకే రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నిజమైన రైతులకే రైతుభరోసా అందాలని మంత్రి తుమ్మల అన్నారు.ప్రజల ఆలోచనల మేరకు ప్రభుత్వం ముందుకెళ్తుందని తుమ్మల అన్నారు. గతంలో జరిగిన ఆర్థిక నష్టాన్ని ప్రజలు గమనించారని వ్యాఖ్యానించారు. చిన్న, సన్నకారు రైతులకు చేయూత నిచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు. రైతుల అభిప్రాయాల సేకరణ తర్వాతే ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని చెప్పారు.