11-07-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి/హైదరాబాద్, జూలై 11: ఇరు రాష్ట్రాల మధ్య నదీజలాల విషయంలో స్పష్టమైన అవగాహనకు రావాల్సి ఉంది. నదీజలాలు ఏటా సముద్రంలో కలుస్తున్నాయి. వాటిని సద్వినయోగం చేసుకునేందుకు ఉమ్మడిగా ప్రాజెక్టుకులను నిర్మించు కోవడం, నిర్వహించుకోవడం అవసరం.అలాగే వాన నీటిని ఒడిసి పట్టుకోవడంలో ఇరు ప్రభుత్వాలు శ్రద్ద చూపాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వాననీటిని వృధాగా పోకుండా ఉమ్మడిగా ప్రణాళికలు సిద్దంచేయాలి. ఇటీవల కృష్ణా, గోదవారి బోర్డుల్లో పరస్పర ఫిర్యాదులతో నీటి పంచాయితీలను కొనసాగించారు. ఇది వాంఛనీయం కాదు. జగన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలో నీటి వాటాలను సహేతుకంగా పంచుకుంటామని, కలసి పోతామని ప్రకటించారు. కానీ ఆ స్ఫూర్తి ఎక్కడా కానరాలేదు. ఇటీవల మరోమారు తెలుగు రాష్టాల్ర సిఎంలు కూర్చుని విభజన సమస్యలను ప్రస్తావించారు. పరస్పర అవగాహనతో ముందుకు పోతామని ప్రకటించారు. అదే సందర్భంలో జలవనరుల విసయంలో పరస్పర అవగాహన అవసరం. సున్నితమైన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్టాల్ర మధ్య సుహృద్భావం ఉండాలే తప్ప రెచ్చగొట్టే విధానాలు సరికాదు. ఉభయ ప్రభుత్వాలు వీలున్నంత త్వరగా సామరస్యంగా జల వివాదాలను పరిష్కరించుకుని ఇటు రాయలసీమ అటు తెలంగాణలోని కరువు ప్రాంతాలకు నీటిని తరలించే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలి.
ఘర్షణల వల్ల నష్టపోయేది రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలే అని గమనించాలి. కేంద్రం కూడా బోర్డులు ఏర్పాటు చేసినా ఫలితం కానరావడం లేదు. సమస్యలను పెద్దవిగా చేయకుండా పరిష్కరించే మార్గాలను చూపుతూ శాశ్వతంగా సమస్యలకు చెక్ పెట్టగలగాలి. ఆల్మట్టి,నారాయణపూర్ ప్రాజెక్టుల కారణంగా కృష్ణా నది కిందనున్న ప్రాజెక్టులకు ఇప్పటికే నీరు సక్రమంగా అందడం లేదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కర్ణాటక, మహారాష్ట్రలకు కేటాయించిన అదనపు జలాలను వారు వినియోగించుకుంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకు మిగులు జలాలు కాదుకదా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలకు కూడా గ్యారంటీ ఉండదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కృష్ణాజలాల్లో తమ వాటాగా ఉన్న నికరజలాలకు గ్యారంటీని పొందడంతో పాటు బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన పద్ధతిలో మిగులు జలాలను వినియోగించుకునే హక్కును తెలుగు రాష్ట్రాలు కాపాడు కోవాలి. ఇందుకోసం ముందుగా ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య పరస్పర విశ్వాసం, అవగాహన ఉండాలి. ఇరు రాష్ట్రాలు ఉమ్మడిగా కేంద్ర పెత్తనాన్ని ఎదుర్కోవలసి ఉంది. ఎవరివాటాలను వారు వాడుకునే విధంగా నడుచుకోవాలి. వివాదాన్ని కేంద్రమే పరిష్కరించాలని కోరడమనేది శతృవుకు జుట్టు ఇచ్చినట్లు అవుతుంది. నీటి సమస్యలు భావోద్వేగాలను తీవ్రతరం చేయడం సరికాదు. అనేక సమస్యలను పరిష్కరించ లేని కేంద్రం ఇక జల వివాదాలను సరిదిద్దుతుందన్న నమ్మకం లేదు.
అందువల్ల ఉన్న ఒప్పందాల మేరకు నడుచుకునే విధంగా తెలుగు రాష్ట్రాల సిఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు కూర్చుని మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇందులో ప్రదానంగా గోదావరి, కృష్ణాల నుంచి వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని వినియోగించడంపై నిపుణులతో చర్చించాలి. విభజనకు ముందువరకు కలసి వున్న మనం ఇప్పుడు జగడాలు పడడం తగనిపనిగా పాలకలు,రాజకీయ పార్టీలు, నేతలు గుర్తించాలి. సమస్యలను ఎగదోసే రాజకీయ పార్టీల నేతల తీరును ఎండగట్టాలి. పొరుగు రాష్ట్రాలతో గొడవలు వద్దనుకుంటున్న ఇరు తెలుగు రాష్ట్రాల సిఎంలు ఈ విషయంలో హుందాగానే ఉంటున్నందున సమిష్టిగా సమస్యలను పంచుకోవాలి. తెలంగాణ మంత్రులు కూడా సంయమనంతో సమస్యలను చర్చించాలి. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో మన బంధాలు బలపడాలి. ప్రభుత్వాలు తమ వాటా నికర జలాలకు కట్టుబడి ఉంటూ, మిగులు జలాలను ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప భావోద్వేగాలు రెచ్చ గొట్టడం వాంఛనీయం కాదు. నిజానికి కృష్ణా,గోదావరి చివరి బేసిన్‌లో ఉన్నవి తెలుగు రాష్ట్రాలే.
ఈ రెండు రాష్టాల్రు ఈ నీటిని ఎలా ఉపయోగించుకోవాల అన్నది నిర్ణయించుకోవాలి. దీనిద్వారా ఇరు రాష్ట్రాల రైతాంగం బాగుపడుద్ది. సముద్రంలోకి నీరు వృధాగా పోకుండా ఉమ్మడిగా ప్రాజెక్టులను నిర్మించకునే అవకాశాలను పరిశీలించాలి. పోతిరెడ్డిపాడు నుంచి కిందకు పూర్తిస్థాయిలో నీరు రావాలంటే శ్రీశైలంలో 881 అడుగులు నీళ్లు ఉండాలి. శ్రీశైలంలో పూర్తి నీటి మట్టం 885 అడుగుల నీళ్లు ఉన్న రోజులు గత 20 ఏళ్లలో ఏడాదిలో 20 నుంచి 25 రోజులు కూడా లేవు. ఇలాంటి సమయంలో పోతిరెడ్డిపాడుకు పూర్తి స్థాయిలో నీటిని తీసుకెళ్లలేని పరిస్థితి. మరోవైపు పాలమూరు రంగారెడ్డి, డిరడి ప్రాజెక్టు, కల్వకుర్తి సామర్థ్యం పెంచి 800 అడుగులలోపే నీటిని తీసుకునే వెసులుబాటు తెలంగాణకు ఉందంటున్నారు. 796 అడుగుల వద్దే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. 800 అడుగుల్లోపు లోనే విూకు కేటాయించిన నీటిని వాడుకుంటే తప్పులేనప్పుడు.. 881 అడుగులు ఉంటే తప్ప నీళ్లు వాడుకోలేని పరిస్థితి మాకున్నప్పుడు.. మేం 800 అడుగుల వద్దే మాకు కేటాయించిన నీటిని తీసుకోవడంలో తప్పేముందని ఎపి అధికారులు ప్రశ్నిస్తున్నారు.
నిజానికి ఈ విషయాలపై స్పష్టత రావాలి. అలాగే రాజకీయంగా మరిన్ని చర్చలు చేయాలి. ఈ క్రమంలో నదీ జలాల పంపిణీ, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణ విషయమై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరింత లోతుగా చర్చలు సాగాలి, నిజానికి సమస్య ఎక్కడుందో ఆలోచించాలి. ప్రజలకు తాగునీరు, సాగు అవసరాలు, జల విద్యుత్తు, పారిశ్రామిక అవసరాలు.. ఇలా నీటి వినియోగ ప్రాధాన్యతలు అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగా నిర్ణయించబడి ఉన్నాయి. ఆయా నియమాలను పాటిస్తూ, ఏవైనా ప్రత్యేక పరిస్థితులు ఏర్పడితే సర్దుబాటు చేసుకొని పరస్పరంగీకారంతో ఉమ్మడి ప్రాజెక్టులను నిర్వహించుకోవాలి. అప్పుడు కృష్ణా, గోదావరుల్లో మనకు ఉన్నంత నీరును సద్వినియోగం చేసుకోవచ్చు.