11-07-2024 RJ
తెలంగాణ
ఆదిలాబాద్, జూలై 11: ఈ ఏడాది జిల్లాలో హరితహారం కింద అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కల ను పెంచేందుకు ప్రణాళికలు తయారు చేశారు. వనమహోత్సవంలో భాగంగా అటవీ ప్రాంతాల్లోని పలుచగా ఉన్న చోట, ఇతర ప్రాంతాల్లో లక్ష మొక్కలను నాటేందుకు అటవీశాఖ అధికారుల చర్యలు తీసుకుంటు న్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఇప్పుడిప్పుడే అడపాదడపా కురుస్తోండడంతో అధికారులు మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. ఈ విడతలో వివిధ శాఖల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలను నాటాలని అధికారులు నిర్ణయించారు. అటవీశాఖ,డీఆర్డీవో ఆధ్వర్యంలో మొక్కలను నాటాలని లక్ష్యంగా ఎంచుకోగా పలు ప్రభుత్వ శాఖలకు సైతం లక్ష్యాలని నిర్దేశించారు. ఇందుకు అవసరమైన మొక్కలను వివిధ శాఖల ఆధ్వర్యంలో నర్సరీల్లో సిద్ధం చేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీల్లో వివిధ రకాల మొక్కల పెంపకాన్ని చేపట్టడానికి డీఆర్డీవో,మున్సిపల్, ఐటీడీఏ ఆధ్వర్యంలో సైతం వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. ఈ విడతలో మొక్కలు నాటాల్సిన ప్రాంతాలను ముందుగానే గుర్తించిన అధికారులు ఏయే ప్రాంతాల్లో ఎలాంటి మొక్కలు నాటాలనే వాటిని గుర్తించి వాటిని నర్సరీల్లో సిద్ధం చేశారు.
ప్రజలు ఇండ్లలో పెంచుకు నేందుకు అవసరమైన మొక్కలను సైతం నర్సరీల్లో పెంచారు. ప్రజలకు అవసరమైన మొక్కలను ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసేందుకు సైతం చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లోని వివిధ ప్రాంతాల్లో టేకు, సీతాఫల్, మలబార్, వేప, కల్పేతర మొక్కలు, ప్రతి ఇంటికి వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు నాటేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటితో పాటు ఆదిలాబాద్ మున్సిపాలిటీ, వ్యవసాయశాఖచే రైతులు భూముల్లో, ఎక్సైజ్ శాఖ, పంచాయతీ శాఖ,పోలీస్ శాఖ నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలోమొక్కలు నాటేందుకు ప్రణాళికల సిద్ధం చేశారు. ఇతర ప్రభుత్వశాఖలైన పౌరసరఫరాలు, బీసీ సంక్షేమం, విద్యాశాఖ, మార్కెటింగ్, ఎస్సీ కార్పొరేషన్, దేవాదాయ శాఖ, మైనార్టీ, ఆర్టీ సీ, విద్యుత్, పరిశ్రమలు, పశు సంవర్థక, మహిళా శిశు సంక్షేమం, వైద్య శాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.