12-07-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూలై 12: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు నాయుడు ఏపీ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను వీలైనంత త్వరగా నెరవేర్చేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఏపీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నిత్యం శ్రమిస్తున్నారు. అధికారులతో సవిూక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ సీఎం బిజీబిజీగా గడుపుతున్నారు. అలాగే ఎక్కడికక్కడ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని త్వరిగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉండవల్లి నివాసం నుంచి సెక్రటేరియట్‌కు వెళ్తుండగా అక్కడ ఉన్న ప్రజలను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ ఆపారు.
నివాసం నుంచి కాన్వాయ్ బయటకు వచ్చిన వెంటనే రోడ్డుపై వినతి పత్రాలతో జనం నిలబడి ఉన్నారు. వారిని కార్‌లో నుంచి చూసిన చంద్రబాబు ముందుకు వెళ్తూ కాన్వాయ్‌లో తన కార్ ఆపివేయించారు. అనంతరం కారు దిగి... అందరి వద్దకు వెళ్లి వినతి పత్రాలు తీసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు చంద్రబాబు హావిూ ఇచ్చారు. అలాగే పార్టీ ఆఫీస్‌లో వినతి పత్రాలు తీసుకునేందుకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశామని అక్కడకు వెళ్లి కూడా ఇవ్వొచ్చని ఈ సందర్భంగా ప్రజలకు చంద్రబాబు చెప్పారు. తమను చూసి సీఎం చంద్రబాబు కారు దిగి వినతి పత్రాలు తీసుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.