22-07-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జులై 22: శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం సోమవారం కొనసాగింది. జెడ్ సి ఉపేందర్‌రెడ్డి పలు శాఖల అధికారులతో అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జెడ్ సి మాట్లాడుతూ.. ప్రజావాణి వినతులను నిర్లక్ష్యం చేయవద్దని, సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. విభాగాల వారీగా సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జెడ్ సి ఉపేందర్‌రెడ్డి సూచించారు. అక్రమ నిర్మాణం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించవద్దని వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి ఆదేశించారు. వీటిపై పర్యవేక్షణ చర్యలకు గాను సర్కిల్ కు ఒకటి చొప్పున బృందాన్ని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.
పట్టణ ప్రణాళిక విభాగం పారిశుధ్యం సహా వర్షాకాలం నేపథ్యంలో శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఆయా శాఖల అధికారులతో జడ్సీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మాట్లాడుతూ అనుమతులకు భిన్నంగా నిర్మించే అక్రమ నిర్మాణాలను నేల కూల్చాలని ఆదేశించారు. సర్కిల్ కు నియమించే బృందాలు ఎప్పటికప్పుడు వీటిపై తగు పర్యవేక్షణ చేపట్టాలని నిబంధనలను ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. కోర్టు కేసులకు సంబంధించి ఎప్పటికప్పుడు పత్రాలను సమర్పించాలని వేగవంతంగా చర్యలు తీసుకునేలా అధికారులు కృషి చేయాలని స్పష్టం చేశారు.
పారిశుధ్య నిర్వహణ పనులను మరింత పటిష్టంగా చేపట్టాలని ఎప్పటికప్పుడు చెత్త.. ఇతర వ్యర్ధాలను తొలగించాలని ఆదేశించారు. మాల్స్, సినిమా హాల్స్‌లలో పార్కింగ్ ఫీజులను వసూలు చేసే విషయంపై అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని.. వాటిల్లో విక్రయించే తిను బండారాను నాణ్యతను పరిశీలించాలని జెడ్ సి ఉపేందర్ రెడ్డి ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పని చేయడం ద్వారా అత్యుత్తమ స్థానంలో నిలబెట్టాలని సూచించారు.