26-06-2024 RJ
భక్తి
తిరుమల, జూన్ 26: భవితకోసం చేసే ఆలోచనలు, కనే కలలు, అభిలాషలు, లక్ష్యాలు, కార్యాచరణ పథకాలు.. వేటినైనా ఈ క్షణం నుంచే అమలుపరచాలి. జ్వరానికి ఔషధం ఈ క్షణం నుంచే తీసుకోవాలి. కూతురి పెళ్ళి చేయాలనుకొంటే ఆ శుభకార్యానికి అవసరమైన యత్నాలకు ఈ క్షణమే శుభకరం. ఈ క్షణం ఎలా ఉపయోగించు కొన్నామా అన్నదానిపైనే రాబోయే క్షణాల్లో ఫలితాలు ఉంటాయి. నిన్న అన్నది గతం. రేపు అనేది ఎవరూ ఊహించని రహస్యం. ఈ క్షణాలు ఒక బహుమానం. వాటిని ఆస్వాదించాలి. చింతించడం వల్ల నిన్నటి బాధ తీరదు. ఏమవుతుందోననే దిగులువల్ల రేపు సంభవించే సంఘటనలో మార్పు రాదు.
గతానికి, భవితకు వారధి ఈ క్షణం. మన వెనక గతం ఉంది. దానినుంచి నేర్చుకోవాలి. మన ముందు భవిష్యత్తు ఉంది. దానికోసం సిద్ధం కావాలి. కానీ ఈ క్షణం మనది.. దానిలో జీవించాలి. క్షణాలు గడిచే కొద్దీ గంట గడచిపోతుంది. గంటలు గడచిపోతే రోజులు గతాలవుతాయి. మనం విశ్రాంతి తీసుకోవలసింది ఎప్పుడంటే.. అందుకు బొత్తిగా మనకు సమయం లేనప్పుడే!