19-12-2023 RJ
భక్తి
శ్రీరంగం, (డిసెంబర్19): మహిళా విద్యకు సజీవ సాక్షి గోదాదేవి ఆళ్వార్ అంటే మనను ఏలు వారు అని అర్థం. ఆచార్యులై మనను పరిపాలించేవారే మనను విష్ణుపథంలో నడిపే వారని అర్థం. వీరిలో పరమ విష్ణుభక్తులు 12 మంది. పన్నిద్దరాళ్వారులు (12 మంది ఆళ్వారులు) అంటారు. ఈ ఆళ్వారులలో చాలామంది వైష్ణవ కులంలో పుట్టిన వారు కాదు. కులబేధాలను పాటించని మతం వైష్ణవం, విశిష్టాద్వైతం. వారిలో తండ్రీకూతుళ్లు పెరియాళ్వారు (పెద్ద ఆళ్వార్) శ్రీవిష్ణుచిత్తులు, గోద ఉన్నారు. 12 మందిలో స్త్రీమూర్తి ఈమె ఒక్కరే.
స్త్రీలు చదువుకోరాదనే వాదనలు చెల్లవనడానికి 12 వందల సంవత్సరాల నాటి సజీవ సాక్ష్యం గోదాదేవి. చదువు జ్ఞానం అందరిదీ అని చెప్పడానికి ఈనాటికీ నిలిచి ఉన్న చిరంజీవ సాక్ష్యం తిరుప్పావై. తులసీ వనంలో పుట్టి విష్ణుచిత్తుని నారాయణ కీర్తనలు మంత్రాలు వింటూ పూజల్లో వెంటనడుస్తూ గోదాదేవి ఎదిగింది. నారాయణుని లీలలను తండ్రి వివరిస్తుంటే విని, అతడే తన భర్త అని ఏనాడో నిశ్చయించు కున్నది. అటువంటి శక్తి సంపన్నురాలు .. మన గోదాదేవి .. ఆండాళ్ తల్లి .. అనుసరించిన భక్తి మార్గాన్ని.. ఈ ధనుర్మాస వ్రత సమయంలో త్రికరణ శుద్ధితో అనుసరించాలి.
మానవ జన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైంది. ఆ భగవత్ ప్రాప్తి ఎక్కడో కాదు, ఈ భూమిపైనే! భక్తి ప్రపత్తి, ఆరాధన, ఆర్తి కలగలిపి సేవిస్తే భగవంతుడు మానవులకు ప్రాప్తిస్తాడని ఎందరో విశ్వసిస్తారు. ఆ ప్రాప్తిని అనుభవించి ఆ అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయడమే శరణాగతి. ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక. ఈ మాసంలో ఆండాళ్ బాహ్య అనుభవంతో అంతరనుభవంతో ముప్పై రోజులు తాదాత్మ్యం చెందుతూ పాశురాలను (కీర్తనలను) గానం చేసింది. సత్సంగం వల్ల భగవత్సంగం ప్రాప్తిస్తుందని ఈ పాశురాల గీత మాలిక తిరుప్పావై నిరూపిస్తుంది.