05-01-2024 RJ
భక్తి
తిరుమల, (జనవరి 5): ఈనెల 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి లక్ష లడ్డూలను పంపనున్నట్లు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుందని చెప్పారు. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు తిరుమలలో ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. ఈ సదస్సుకు దేశంలో ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరవుతారని చెప్పారు.
తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన 'డయల్ యువర్ ఈవో' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శ్రీవారి భక్తులు నకిలీ వెబ్ సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశంతోనే అధికారిక వెబ్ సైట్లో మాత్రమే ఆర్జితసేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలని భక్తులను కోరుతున్నట్లు ఈవో చెప్పారు.
ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా జనవరి 15న తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం ప్రాంగణంలోని పరేడ్ మైదానంలో సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు 'శ్రీ గోదా కల్యాణం' వైభవంగా నిర్వహిస్తామన్నారు. జనవరి 16న కనుమ పండుగ సందర్భంగా శ్రీవారి పార్వేట ఉత్సవం నిర్వహించనున్నట్లు ధర్మారెడ్డి వివరించారు.