14-01-2024 RJ
భక్తి
క్రాంతి అనే మాటకు సంక్రమించడం అని అర్థముంది. సూర్యగమనాన్ని బట్టి వచ్చేదే మకర సంక్రాంతి. కాలచక్రంగా ఉన్న సూర్యుడి గమనంతో ముందుకు సాగడం ముఖ్యం. అందుకే మకర సంక్రాంతినాడు చేసే దాన, జప, తర్పణాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తారు. సూర్యుడు ప్రాతఃకాలానికి చైతన్యం కలిగిస్తున్నాడు. మానవజాతికి, పశుపక్ష్యా దులకు, చెట్లకు అమృతత్వాన్నిచ్చే జీవన దాత. కిరణ జన్య సంయోగ క్రియ ద్వారా వృక్షాల పెరుగుదలకు, జీవకణాల వృద్ధికి కారణమవుతున్న ఆయనను సృష్టి కార్యక్రమ నిర్మాత అనవచ్చు. చల్లని చలుగాలుల నుంచి నులివెచ్చని వేడి అందించే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం.. ఉత్తరాయణ పుణ్యకాలం ఆగమించడం సంక్రాంతి ప్రత్యేకత.
లిప్త పాటు కాలంలో మకర రాశిలోకి ప్రవేశించే సూర్యభగవానుడు ఉత్తరాయణ మహాపుణ్య కాలానికి నాంది పలుకుతాడు. తృటిలో వందో వంతు కాలంలో సూర్యుడొక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయాన్ని పుణ్యకాలంగా పరిగణిస్తారు. అత్యంత సూక్ష్మంగా ఉండే ఈ కాలాన్ని కనిపెట్టడం దాదాపు అసాధ్యం. అందువల్లే సంక్రమణానికి ముందు పదహారు, తరువాత పదహారు ఘడియలు పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఈ ఘడియల్లోనే సంక్రాంతి సంబరాలను చేసుకోవడం ఆనవాయితీ గా వస్తోంది. సూర్య గమనాన్ని ఆధారంగా చేసుకుని అనుసరించే కాలగణన పద్ధతే 'సౌరమానం'.
సూర్యగమనం మూడు విధాలు. అవి మంద, శీఘ్ర, సమగతులు. ఉత్తరాయణంలో సూర్యుడు ఆరోహణ క్రమంలో ఉంటాడు కాబట్టి గతి మాంద్యం పొందుతాడు. అంటే నిదానంగా కదులుతాడన్న మాట. వృషభం మొదలుకుని కన్యా రాశి వరకు గల ఐదు రాశులలో సంచరి స్తున్నప్పుడు పగటి సమయం ఎక్కువగా, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. దక్షిణాయనంలో సూర్యుడు అవరోహణ క్రమంలో ఉంటాడు కాబట్టి గమనం వేగంగా సాగుతుంది.
దీనివల్ల వృశ్చికం నుంచి మీనం వరకు గల 5 రాశుల్లో సూర్యుడు సంచరిస్తున్నప్పుడు పగటి పూటల నిడివి తగ్గుతుంది. రాత్రుళ్లు దీర్ఘంగా ఉంటాయి. ఇలా కదిలే క్రమంలో సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. ఓ రకంగా చెప్పాలంటే రైతులను స్మరించుకుని, పాడి పశవులను లాలించేదే ఈ పండగ ప్రత్యేకత.
సూర్యుడు ఆరోగ్య ప్రదాత కనుక ఆయన కోసం ప్రపంచ మంతా ఎదురుచూస్తున్న వేళ సంక్రమణం ఓ గొప్ప వరం. సృష్టిలోని పంచభూతాలను మనం ఆరాధిస్తాం. ఇదంతా ప్రకృతికి సంబం ధించిన ఆరాధన. చెట్లు, పర్వతాలు, పంచభూతాలు ఒకటేమిటి అన్ని వస్తు పదార్థాలను మానవుడు వినియో గించుకుంటున్నాడు. అందుకే వీటికి కృతజ్ఞతగా ఆరాధన చేయడం మానవ ధర్మం.
సృష్టిలో ఉన్న ధర్మాన్ని అవగాహన చేసుకుంటే మనలో వివేకం కలుగుతుంది. సృష్టిలో ఉన్న వివేకం మనిషిలోనూ ఉంది. ఈ రెంటికి సంబంధం తెగిపోతే మానవుడు గతి తప్పుతాడు. ఖగోళశాస్త్రం ప్రకారం ఒక్కోనెల ఒక్కో రాశిలోకి సూర్యుడు సంక్రమిస్తాడు. ఇలా ప్రతి నెలా మనకు సంక్రాంతి వస్తూనే ఉంటుంది. ఇలా ఏడాదిలో వచ్చే పన్నెండింటిలోనూ ముఖ్యమైంది మకరరాశిలో సూర్యుడ సంక్రమించే సమయం. అదే మకర సంక్రాంతి. మన పంటలు ఇంటికి వచ్చే వేళ... ముంగిళ్లలో పాడి పొంగి పొరలే వేళ... గంగిరెద్దులు, జానపదులు ఆడిపాడే వేళ... పండగ తియ్యతియ్యగా చేసుకునేందుకు ప్రజలు సిద్ధమవుతారు.
ముఖ్యంగా మన పల్లెల్లో నెలకొనే పండగ వాతావరణం కమనీయం. ఈ వేడుకలకంతటికీ మూలకారణం సూర్య భగవానుడే. కాబట్టి ఇది సూర్యదేవుడి పరంగా జరిగే పెద్ద పండగగా భావిస్తారు. భిన్న జాతులకు, మతాలకు, విభిన్నమైన దేవుళ్లు ఉండవచ్చు. కానీ అందరికీ ప్రత్యక్ష దైవం సూర్యుడు. సూర్య గమనం భూమధ్య రేఖకు ఉత్తరంగా ఆరు నెలలు, దక్షిణంగా ఆరు నెలలు అక్షాంశాలను బట్టి మారుతూ ఉంటుంది.
కర్కాటక రేఖ మన దేశంలోని వింధ్య పర్వతాల మీదుగా వెళుతుంది. కర్కాటక సంక్రమణంతో దక్షిణాయనం ప్రారంభమ వుతుంది. ఈ కాలం పితృ దేవతలకు ప్రీతికరమైంది. సూర్యుడు భూమధ్య రేఖకు ఉత్తర అక్షాంశంలో సంచరించే ఆరు నెలలు ఉత్తరాయణం. ఇది దేవతలకు అత్యంత ఇష్టమైన కాలమని చెబుతారు. ఆధ్యాత్మికంగా, జ్యోతిష శాస్త్ర రీత్యా ఇది అద్భుతమైన రోజు. అందుకే స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన భీష్ముడు మహాభారత యుద్ధంలో క్షతగాత్రుడై ఉత్తరాయణ పుణ్యకాలం కోసం అంపశయ్యపై ఎదురు చూస్తూ మాఘ శుద్ధ అష్టమి రోజు తనువు చాలించాడు.
సంక్రాంతి కూడా ప్రకృతి ఆరాధనకు సంబంధించినదిగా, పశువులను పూజించేదిగా గుర్తించాలి. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువుని మానవుడు వినియోగించు కుంటున్నాడు. భారత, భాగవతాది గ్రంథాలన్నీ మనిషికి ప్రకృతిధర్మం నేర్పడానికే రూపొందాయి. క్రతువులు, వ్రతాలు పూజలు ఏదైనా మనిషికి బుద్ధి సమకూర్చేవే. శిక్షణ, రక్షణ, పోషణ, క్రమశిక్షణ ఈ నాలుగు సమాజానికి నాలుగు అంగాలు.
భూమి నుంచి సారాన్ని, ప్రాణశక్తిని వెలికి తీసి దానిని పంటగా పండించి, ఆ పంటను మన అందరికీ చేర్చి ఆహారంగా అందించి, మనిషి, జంతుజీవాల ప్రాణశక్తిని పెంపొందించి, శక్తిమంతులను చేస్తున్నది రైతు. కర్షక బాంధవుడు, శ్రమజీవి, రైతు వారిద్దరి వలన మన జీవితం సాగుతోంది. ఈ విషయాన్ని గమనించిన నాడు సమాజం సుఖంగా ఉంటుంది. అందుకే పండగలప్పుడు వీటి విశిష్టతలను తెలియ చేసుకుంటాం. దేవతలకు మకర సంక్రమణంతో రోజు ప్రారంభ మవుతుందని చెబుతారు. బ్రహ్మాండంలో ఏదైతే ఉందో అండాండంలో కూడా అదే ఉంది.
రెంటికి మధ్య సంబంధం తెగిపోతే మానవుడు గతి తప్పుతాడు. పరమాత్మ సర్వాంతర్యామి అన్న సంగతి గుర్తించి పూజలు చేయడం వలన సఫలం అవుతాం. ఆధ్యాత్మికత అంటే నోములు, వ్రతాలు, పూజలు మాత్రమే కాదు భాగవతంలో చెప్పినట్టు భగవంతుడు తర్వాత రైతు, కర్షకుడు, శ్రామికుడు వీరే దేవుళ్లు. ఇదంతా ప్రకృతిలో భాగంగా గుర్తించి ఆచరించడమే ముఖ్యం.