14-01-2024 RJ
భక్తి
విజయవాడ, జనవరి 14: మన పండగల్లో ఎప్పుడూ ఒక పరమార్థం ఉంటుంది. సంక్రాంతి పండగ నెల రోజులూ తెలుగు పల్లె సీమల్లో సందడే సందడి. ధనుర్మాసం ప్రవేశించగానే సంక్రాంతి కోలాహలం మొదలవుతుంది. ముగ్గులు, గొబ్బెమ్మలు, పూల అలంకరణలతో ప్లలెల్లో ప్రకృతికి నిత్యారాధన చేస్తారు. మకర సంక్రమణం సమయంలో రథం ముగ్గులతో తీర్చిదిద్దడం పెద్దలకు పుణ్యలోకాల మార్గాలను సుగమం చేయడమేనని అంటారు. ఆ సమయంలో దానధర్మాలకు వెసులుబాటు ఉంటుంది. ఆ సమయంలో హరిదాసులు, గంగిరెద్దుల వారు, జంగమ దేవరలు... ఇలా ఎందరో జానపద కళాకారులు ఇంటి ముందుకే వస్తారు. మనమిచ్చే కానుకలు అందుకుంటారు.
ఒకప్పుడు వస్తుమార్పిడికి సంక్రాంతి సమయం ఆలవాలంగా ఉండేది. కొత్త అల్లుళ్లు, బంధువుల రాక, పిండి వంటల తయారీ, పిల్లలకు భోగిపళ్ల అభిషేకాలు, పిడకలు దండకట్టడాలతో ప్రతి ఇంటా ఎంతో సందడి. నిజంగా ప్రతి గ్రామం ఈ పండగ రోజుల్లో ఓ సౌభాగ్య సీమగా మారుతుందనడంలో సందేహం లేదు. దేవీదేవతలను ఆరాధించి కృతజ్ఞతలు చెప్పుకోవడం, పితృదేవతలను స్మరించుకోవడం అటు భౌతికంగా, ఇటు ఆధ్యాత్మికంగా ఉన్నత భావాలకు నిదర్శనాలు. సంక్రాంతినాటికి అన్ని రకాల పంటలు పొలాల నుంచి ఇంటికి చేరతాయి. సూర్యుడు సకల దేవతల తేజస్సును, ఓజస్సును, శక్తిని, సామర్థ్యాన్ని, అంశను, అనుగ్రహాన్ని తనలో నిక్షిప్తం చేసుకున్నాడు.
సర్వజీవులనూ అనుగ్రహించే ఆ దివ్యమూర్తి ఆరాధన అనాదిగా వస్తున్న సంప్రదాయం. అందుకే సంక్రాంతి ఓ పండగ కాదు, అదో సదాచారం. ప్రత్యక్ష నారాయణుడికి జోతలర్పించడం తెలుగువారి సంస్కృతికి నిలువుటద్దం. రంగవల్లులు... భోగి మంటలు.. పిండివంటలు... డూడూ బసవన్నలు.. హరిదాసులు... సంప్రదాయ వస్త్రాలు.. ఇల్లంతా బంధువులు... ఆనంద డోలికలు...మూడ్రోజుల తెలుగింటి పెద్దపండగ ఇవీ మన సంక్రాంతి పర్వదినం ప్రత్యేకతలు.