23-01-2024 RJ
భక్తి
అయోధ్య, జనవరి 23: అయోధ్య శ్రీరామచంద్రుడు తన ప్రతాపంతో లంకాధీశుని సంహరించాడు. భువిలోని ప్రజలూ, దివిలోని దేవతలూ కూడా సంతోషించారు, సంబరాలు చేసుకున్నారు. రావణాసురుడి లంక వైభవానికి లక్ష్మణాదులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అప్పుడే లంకాధిపతిగా అభిషిక్తుడైన విభీషణుడు- లంకలో కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని వెళ్లమని శ్రీరాముణ్ణి అభ్యర్థించాడు. లక్ష్మణ, సుగ్రీవులు సహా అందరికీ అది ఆమోదయోగ్యం, ఆనందదాయకంగా తోచింది.
కానీ జానకీనాథుడు ఆ విన్నపాల్ని సున్నితంగా తిరస్కరిస్తూ 'లక్ష్మణా! లంక ఎంత సువర్ణ మయమైనా, నాకు మనస్కరించటం లేదు' అన్నాడు. అంతేకాదు 'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ.. కన్నతల్లి, జన్మభూమి స్వర్గం కన్నా ఉన్నతమైనవి' అని స్పష్టం చేశాడు. ఆ జగదేకపతి శ్రీరాముడి జన్మభూమి మరేదో కాదు.. అయోధ్య అనే సుందర సుసంపన్న ప్రదేశం.
నాటి త్రేతాయుగం నుంచి నేటి కలియుగం వరకు ఆ అయోధ్య అశేష జనవాహినికి పుణ్యస్థలం. తాను అవతరించినందుకే కాదు, అసమాన శౌర్య ప్రతాపాలకు, ఆధ్యాత్మిక అనుభూతులకు ఆలవాలమైనందుకే రామయ్యకు ఆ ప్రాంతమంటే అంత ప్రీతి. రఘురాముడికి ప్రాణప్రదమైన అయోధ్యలో, ఆ దాశరథి పేరిట నిర్మించిన మందిరంలో, ఆ దివ్య మూర్తికి నిన్నటి రోజు ప్రాణప్రతిష్ఠ జరిగినందుకు అశేష రామభక్తులకు మహా ఆనందదాయకం.