10-05-2024 RJ
భక్తి
"వైశాఖమాసస్య చ యా తృతీయా నవమ్య సౌ కార్తీక శుక్లపక్షే
నభస్య మాసస్య తమిస్రపక్షే త్రయోదశీ పంచదశీ చ మాఘే"
భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియ తిథి రోజున హిందువులు, జైనులు జరుపుకుంటారు. ఈ ఏడాది మే 10 వ తేదీ అక్షయ తృతీయ వచ్చింది. శుక్రవారం పూట అక్షయ తృతీయ రావడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈరోజు ఎటువంటి కార్యక్రమం తలపెట్టినా దాని ఫలితం అక్షయం. "అక్షయ తృతీయ" రోజు దానం కూడా అనేక రెట్లు ఫలితం లభిస్తుంది. ఏం కొనుగోలు చేసిన అది అనంతంగా మారుతుంది. స్కంద పురాణం ప్రకారం అక్షయ అంటే ఎప్పటికీ క్షీణించనది అని అర్థం. ఈ ఏడాది అక్షయ తృతీయ అనేక శుభ యోగాలతో వచ్చింది. దీని వల్ల ఈరోజు ప్రాముఖ్యత రెట్టింపు అయ్యింది. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజని.. మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా పేరుంది. ఈ రోజు లక్ష్మీ దేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరిసంపదలతో కలకళలాడుతుందన్నది భక్తులు నమ్మకం. అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞయాగాది క్రతువులూ, పూజలు, జపాలు దివ్యమైన ఫలితాలనిస్తాయని నమ్మకం. ఈ విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్టుగా మత్స్యపురాణం ఉంది. ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలం సిద్ధుస్తుందని నారద పురాణం చెబుతోంది.
అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి. ధర్మం నాలుగు పాదాలమీద నడిచిన కాలమది. ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవట! నేలను ఒక అడుగులోతు తవ్వినా జలధార పొంగుకొచ్చేదట! నిరు పేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు ఇదే. క్షీరసాగరమధనం తర్వాత లక్ష్మిదేవిని మహావిష్ణువు వరించిన రోజు ఇదే! నరసింహ స్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించింది ఈ రోజే కాబట్టే అక్షయ తృతీయ నాడు...రాహుకాలాలూ వర్జ్యాలు వర్తించవు. ప్రతి నిమిషం సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే! అక్షరాభ్యాసాలూ అక్షయ తృతీయరోజే పెట్టకుంటారు. ఈ రోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయం అవుతుం
అక్షయ తృతీయ ప్రాముఖ్యత:-
1. దశావతార ప్రభు పరశురాముని జన్మదినం
2. పవిత్ర గంగా నది భువికి దిగివచ్చిన పర్వదినం
3. కృతయుగం మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం , కుచేలునికి ధనరాశులు ఇచ్చిన దినం
5. వ్యాస మహర్షి "మహా భారతము"ను, వినాయకుని సహాయముతో ప్రారంభించిన దినం
6. శ్రీకృష్ణుడు వనవాసములో వున్న పాండవులకు "అక్షయ పాత్ర" ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు "కనకధారాస్తవం" ను చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం
11. ఒడిషా పూరి రథయాత్ర సంబరాల కొరకు నిర్మించే రథ నిర్మాణం ప్రారంబించే రోజు.
12. బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకొనే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే
దక్కుతుంది.
13. ఈ రోజే సింహాచలం దివ్యక్షేత్రం లో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభపు రోజు.
శ్రీ మహాలక్ష్మి స్తోత్రం
నమస్తే స్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే||
మహాలక్ష్మి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించే వాళ్ళు సకల పాపాల నుండి విముక్తులవుతారు. ధన ధాన్య సమృద్ధి పొందుతారు. శత్రు బాధలు తొలగిపోతాయి. ఇంట్లో పేదరికం, కష్టాలు తొలగిపోయి సంపదతో సంతోషంగా ఉంటారు. నిత్యం ఈ స్తోత్రం పఠించడం వల్ల మహాలక్ష్మి ప్రసన్నురాలవుతుంది. అక్షయ్ అనేది సంస్కృత పదం. దీని అర్థం క్షయం లేనిది అంటే ఎప్పటికీ అంతం లేనిది. ఈరోజు ఏ శుభకార్యం చేపట్టినా దానికి అంతులేని ఫలితాలు లభిస్తాయి.
నమస్తే గరుడారూఢే కోలాసుర-భయంకరీ
సర్వ-పాప-హరే దేవి మహాలక్ష్మీ నమో స్తు తే
కుబేర లక్ష్మీ మంత్రం
ఓం శ్రీం హీం హం కుబేర లక్ష్మీ కమలధారణ్య ధనాకర్షణే స్వాహా
ఈ కుబేర లక్ష్మీ మంత్రాన్ని 108 సార్లు ఉచ్చరించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది.
ఓం శ్రీం శ్రీం క్రీం కుబేరాయ అష్టలక్ష్మీ
మమ గ్రిహి ధనం పూరయ పూరయ నమః
ఈ మంత్రాన్ని జపిస్తే కుబేరుడి ఆశీస్సులు లభిస్తాయి.
సర్వజ్ఞే సర్వ వరదే సర్వదుష్ట భయంకరి
సర్వదుఃఖ హరే దేవీ మహాలక్ష్మి నమోస్తుతే
ఈ మంత్రం పఠించడం వల్ల సర్వ దుఖం నుంచి విముక్తి కలుగుతుంది. దుష్ట శక్తుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
సర్వేజనా సుఖినోభవంతు