13-12-2023 RJ
జాతీయం
- పబ్లిక్ గ్యాలరీ నుంచి దూసుకు వచ్చిన దుండగులు
- టియర్ గ్యాస్ వదలడంతో అప్రమత్తమైన సిబ్బంది
- ఘటనతో పరుగులు తీసిన ఎంపిలు.. లోక్ సభ వాయిదా
- ఘటనపై విచారణకు ఆదేశించిన స్పీకర్ ఓంబిర్లా
న్యూఢిల్లీ, (డిసెంబర్ 13): పార్లమెంటులో భద్రతావైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. బుధవారం లోక్ సభ జరుగుతున్న సమయంలో పబ్లిక్ గ్యాలరీనుంచి ఇద్దరు యువకులు అకస్మాత్తుగా సభలోకి దూకారు. నల్లచట్టాలను రద్దుచేయాలి అంటూ వారు నినాదాలు చేస్తుండగా, కొందరు ఎంపీలు వారిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు, దీంతో సభ వాయిదాపడింది.
22 ఏళ్ళ క్రితం ఇదే రోజు పార్లమెంటపై ఉగ్రవాదుల దాడి చేశారు, తిరిగి అదే రోజున ఈ సంఘటన చోటు చేసుకోవడం కలవరం రేకెత్తిస్తోంది. లోక్ సభలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్యాలరీ నుంచి ఇద్దరు అగంతకులు లోక్ సభలోకి దూకి టియర్ గ్యాస్ వదిలారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. దీంతో వెంటనే ప్యానల్ స్పీకర్ సభను వాయిదా వేశారు. ఎంపీలు భయంతో బయటకు పరుగులు తీశారు.
కొత్త పార్లమెంట్లో భద్రతా వైఫల్యం కనిపిస్తోంది. స్పీకర్ వైపు ఓ ఆగంతకుడు పరిగెత్తాడు. కొత్త పార్లమెంట్ లోక్ సభ లో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. అయితే ఆ ఇద్దరిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారని, వారిని విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకు వస్తాయని ఎంపీలు తెలిపారు.
ఈ సంఘటనపై పార్లమెంటు సభ్యుడు కార్తీ చిదంబరం మాట్లాడుతూ అకస్మాత్తుగా ఇద్దరు యువకులు విజిటర్స్ గ్యాలరీలోంచి సభలోకి దూకారు. వారి చేతిలో ఉన్న పొగడబ్బాలలోంచి పసుపు రంగులో పొగ వెలువడుతోంది. వారిలో ఒకడు స్పీకర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించాడు.
ఇది పార్లమెంటులో భద్రతావైఫల్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. పార్లమెంట్లో ఆగంతకులు చోర్చుకురావడంపై ఎంపీ రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగిందన్నారు. దీని వెనుక ఎవరున్నారు అనేది తేలుతుందని అన్నారు. లోక్ సభలో జరిగిన ఘటనపై స్పందించిన నమాజ్వాదీ పార్టీ (ఎన్పి) ఎంపి డింపుల్ యాదవ్ ట్వీట్ చేశారు. ఇది లోక్సభలో భద్రతా ఉల్లంఘన అని.. ఇక్కడికి వచ్చే వారందరూ - అది సందర్శకులు లేదా రిపోర్టర్లు.. వారు ట్యాగ్లను కలిగి ఉండరు.
కాబట్టి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని నేను భావిస్తున్నాను. ఇది పూర్తి భద్రతా లోపం అని నేను భావిస్తున్నాను. లోక్ సభ లోపల ఏదైనా జరిగి ఉండవచ్చని డింపుల్ యాదవ్ ట్వీట్ చేశారు.
పార్లమెంట్లో బుధవారం మధ్యాహ్నం 1.02 గంటలకు జీరో అవర్లో ఇద్దరు వ్యక్తులు గుర్తు తెలియని పసుపు రంగు పొగను వెదజల్లుతూ సందర్శకుల గ్యాలరీ నుంచి దూకి లోక్సభ ఛాంబర్లోకి పరుగెత్తడంతో భద్రతా ఉల్లంఘన జరిగింది. ఈ ఘటనపై విచారణ జరిపించే బాధ్యత తనదని లోక్ సభ స్వీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నిందితులు వదిలిన గ్యాన్ ఏమిటి అనేదానిపై విచారణ చేస్తున్నామన్నారు.
ఎంపిల ఆందోళనను పరిగణలోకి తీసుకున్నామని స్వీకర్ తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని ఆయన వెల్లడించారు. తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించామన్నారు. విచారణ తర్వాత అన్ని విషయాలు బయటకొస్తామని పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరు అమోల్ షిండే కాగా, మరొక మహిళ పేరు నీలమ్ కౌర్ గా గుర్తించారు. నియంతృత్వం ఇక చెల్లదు అంటూ నిందితులు మీడియా ముందు నినాదాలు చేశారు.