14-12-2023 RJ
జాతీయం
న్యూఢిల్లీ, (డిసెంబర్ 14): ఏ కోణంలో చూసినా ఇది ముమ్మాటికీ భద్రతా వైఫల్యంగానే చూడాలి. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంగానే చూడాలి. పార్లమెంటుపై దాడి జరిగిన రోజే.. అమరులకు నివాళి అర్పించిన రోజే.. అలాంటి ఘటనలు జరక్కుండా గట్టిగా చర్యలు తీసుకున్నామని చెప్పకుంటున్న తరుణంలో.. భారత పార్లమెంటులో బుధవారం భారీ భద్రతా వైఫల్యం చోటుచేసుకున్నది.
విజిటర్ పాస్లు పై వచ్చిన ఇద్దరు దుండగులు లోక్ సభ గ్యాలరీ నుంచి సమావేశ ప్రధాన మందిరంలోకి దూకి బీభత్సం సృష్టించిన తీరు భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. చాలా సులువుగా, సునాయానంగా మన పార్లమెంటులోకి వచ్చి ఏమైనా చేయవచ్చన్న సందేశాన్ని ఇచ్చినట్లుగా గుర్తించాలి. దేశంలో వివిధ వర్గాల టెర్రరిస్టులు చేస్తున్న దాడులకు భిన్నంగా ఇద్దరు ఆగంతకులు పార్లమెంటులో చేసిన అలజడి దేశమే కాదు..ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చేసింది.
సరిగ్గా 22 ఏండ్ల కిందట ఉగ్రదాడి జరిగిన డిసెంబర్ 13వ తేదీనే ఈ ఘటన చోటుచేసుకోవడం.. నిజంగా మన భద్రతా వైఫల్యం కాక మరోటి కాదు. ఇద్దరు లోపలా.. మరో ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ వెలుపల పొగ వదులుతూ ఆందోళన చేసిన ఘటనతో మనమంతా కళ్లు తెరవాలి. ఈ ఘటన నేపథ్యంలో కొత్త పార్లమెంట్లో భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయనడంలో సందేహం లేదు.
22 ఏండ్ల క్రితం లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి చేసిన డిసెంబర్ 13నే మళ్లీ పార్లమెంటుపై అసాధారణ ఘటన చోటుచేసుకొన్న తీరు.. ఓ రకంగా ఉగ్రవాదులకు దారి చూపినట్లుగా ఉంది. నాడు ఉగ్రవాదులు పార్లమెంటు భవనం లోపలికి ప్రవేశించలేక పోయారు. కానీ, ఈసారి పక్కా ప్లాన్ ప్రకారం దుండగులు ఏకంగా లోక్ సభ సమావేశ మందిరంలోకే చొరబడి భీబత్సం సృష్టించ గలిగారు.
ఇదంతా ఎందుకు జరిగింది.. ఎలా రాగలిగారు అన్నది పక్కన పెడితే మన భద్రతా సిబ్బంది ఎంతగా నిద్దుర పోతున్నారో..ఎంతగా నిర్లక్ష్యంగా ఉంటున్నారో గుర్తించే సందర్భం ఇది. ఈ ఘటనపై విచారణ జరపడం ఒక ఎత్తయితే.. భద్రతా చర్యలపై సమీక్షించుకోవాల్సిన ఆగత్యం ఏర్పడింది. సందర్శకులుగా సభలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు.. గ్యాలరీ నుంచి దూకి .. గ్యాస్ వదులుతూ హంగామా చేయడం సినిమాల్లో మాత్రమే సాధ్యం. కానీ నిజజీవితంలోనూ సాధ్యం అని నిరూపించారు.
సభలో బెంచీలపై నుంచి దూకుతూ స్పీకర్ కుర్చీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన తీరు ముమ్మాటికి భద్రతా సిబ్బంది నిర్లక్ష్యమే. పాసులు పుచ్చుకుని వచ్చేవారి క్షణ్ణంగా తనిఖీలు చేయలేదనే చెప్పాలి. నాలుగంచెల భద్రతా వలయాన్ని దాటుకుని రాగలిగారంటే భద్రతా సిబ్బంది నిజంగానే నిద్ర పోతున్నారనే చెప్పాలి. తనిఖీల్లో వీరు పట్టుకుని వచ్చిన పొగబాంబులను గుర్తించక పోవడం..అలాంటి వస్తువులు వారివద్ద ఉన్నా పట్టించుకోక పోవడం క్షమించరాని నిర్లక్షంగా చూడాలి.
ఇక్కడ రెండు విషయాల పై గట్టి విచారణ జరగాలి. ఇలాంటి వ్యక్తులను లోపలికి పంపేముందు ఎలాంటి తనిఖీలు జరిపారన్నది ముఖ్యం. ప్రధానంగా విజిటర్ పాస్లు తీసుకుని వచ్చే వారిని క్షుణ్ణంగా తనికీ చేస్తారు. అలాంటి తనిఖీలు చేశారా లేదా అన్నది గుర్తించాలి. విజిటర్లు ఎలాంటి వస్తువులను తీసుకుని రాకుండా చూస్తారు. అయినా వారివద్దకు అవి ఎలా వచ్చాయన్నది ముఖ్యం. ఇకపోతే విజిటర్లుగా వచ్చేవారు ప్రధానంగా పాస్ ఇచ్చే ఎంపికి తెలిసిన వారే అయివుంటారు. ఇలాంటి వారిని ఎలా అనుమతించారన్నది కూడా విచారించాలి.
నిరంకుశత్వం నశించాలి, భారత్ మాతాకీ జై, జై భీమ్, జై భారత్ అంటూ నినాదాలు చేసిన వారు కనుక వీరి లక్ష్యం ఏంటన్నది విచారించాలి. ఈ భద్రతా వైఫల్యం ఘటన నేపథ్యంలో పార్లమెంటు రక్షణ వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉన్నదనేది తేలిపోయింది. పార్లమెంటు లోపలా, ఆవరణలోనూ బుధవారం జరిగిన ఘటనలు అత్యంత తీవ్రమైనవిగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు జరక్కుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది సమీక్షించాలి.
ఆగంతుకలును క్షణాల్లోనే పట్టుకున్నా.. ముందే వీరిని ఎందుకు నిలవరించలేదన్న అనుమానాలు ఉన్నాయి. సభలోపల ఇదంతా జరుగుతున్నప్పుడే పార్లమెంటు ఆవరణలో మరో ఇద్దరు ఇటువంటి చర్యలకే పాల్పడ్డారు. వారి చర్యల వల్ల సభ్యులతో సహా ఎవరికీ ఏ ప్రమాదమూ వాటినప్పటికీ భారీ భద్రతా వైఫల్యానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఈ ఘటనకు ముందే ..2 ఏళ్ళక్రితం సరిగ్గా ఇదేరోజున పార్లమెంటుపై జరిగిన దాడిలో అమరులైన వారికి ప్రధాని మోడీ, స్పీకర్, మంత్రులు నివాళి అర్పించారు.
అంటే భద్రత కట్టుదిట్టంగానే ఉందని భావించాలి. ఆగంతకులు వచ్చిన సమయంలో ప్రధాని సభలో లేకున్నా, సోనియాగాంధీ, రాహుల్ సహా కొందరు ముఖ్యమైన సభ్యులు దాడి జరిగిన క్షణంలో సభలోనే ఉన్నారు. నిజంగానే వారు ఏ విషవాయువులనో వోలిగుంటే ప్రమాదం ఎంతగా ఉండేదో ఊహించు కుంటేనే కష్టంగా ఉంటుంది. పార్లమెంటుపై దాడిచేస్తామంటూ భారతదేశం ఉగ్రవాదిగా ప్రకటించిన ఖలిస్తానీ నేత గురుపత్వంత్నింగ్ పన్నూ అమెరికానుంచి ముందుగానే ఓ హెచ్చరిక చేశాడు.
ఆగంతకులిద్దరి ప్రవేశానికి సొంత సంతకంతో పనులు జారీ చేసింది కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ కావడం అధికారపక్షాన్ని మరింత ఆత్మరక్షణలో పడేసింది. తాజా ఘటనతో ..ఎంతో ఘనంగా నిర్మించిన కొత్తభవనంలోనూ ప్రజా ప్రతినిధులకు భద్రత కరువైందన్న విమర్శలకు జవాబు లేదు. ఎన్నిరకాల భద్రతా చర్యలు తీసుకున్నా .. లోపలికి వచ్చే వ్యక్తులను క్షుణ్ణంగా పరీక్షించి పంపకుంటే జరిగే అనర్థాలకు తాజా ఘటన ఉదాహరణగా చెప్పుకోవాలి.
ఇది కేవలం వ్యక్తులను లోనికి అనుమతించే సిబ్బంది నిర్లక్ష్యంగానే చూడాలి. నిందితులు పొగగొట్టాలను గుర్తించక పోవడం నిర్లక్ష్యం కాక మరోటి కాదు. ఇలాంటి వారికి పాస్ లు జారీచేయడంలో కనబరిచిన నిర్లక్ష్యం క్షమార్హమైనది కాదు. వారెవరో కూడా గుర్తించకుండా ఓ అధికార పార్టీ ఎంపి పాసులు జారీచేయడం దారుణం.
లోక్ సభ మందిరంలోకి దూకిన దుండగులను సాగర్ శర్మ(26), డీ మనో రంజన్ (34)గా గుర్తించారు. సాగర్ శర్మ యూపీలోని లక్నౌ కాగా. మనోరంజన్ కర్ణాటక లోని మైసూర్. వీరిద్దరూ ఎంపికి ఎలా పరిచయం అన్న వివరాలు రాబట్టాలి. పాసుల జారీలో మార్గదర్శకాలను పటిష్టం చేయాలి. సెక్యూరిటీ సిబ్బందిని మార్చి... తగు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని గుర్తించాలి. అప్పుడే ఇలాంటి చర్యలను నిరోధించగలుగుతాం. భద్రతా వైఫల్యానికి కారణమైన 8 మందిపై అధికారులు చర్యలు చేపట్టారు. వారిని సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.