16-12-2023 RJ
జాతీయం
పార్లమెంట్ ఎన్నికలకు ఇక ఎంతో దూరం లేదు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాకమమైనవి. ఎందుకంటే ఉత్తరాదిలో కాంగ్రెస్ మెల్లగా ఊడ్చి పెట్టుకుని పోతోంది. మొన్నటికి మొన్న మూడు రాష్ట్రాల్లో ఓటమి పాలయ్యింది. ఈ ఫలితాల తరవాత ఇండియా కూటమిపై అనుమానాలు మొదలయ్యాయి. మరోవైపు ఈ ఫలితాలతో మోడీ మరోమారు తన విశ్వపాన్ని చూపారు.
దేశంలో ఇప్పుడు మోడీని ఢీకొనడమెలా అన్న సందిగ్ధంలో విపక్షాలు తప్పటడుగులు వేస్తున్నాయి. సంస్థాగత పటిష్టత, అపారమైన ఆర్థిక వనరులు, సైద్ధాంతిక స్పష్టత అనేవి ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడంలో బీజేపీకి ఎనలేని స్థాయిలో తోడ్పడింది. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండడంతో పాటు పోలింగ్ బూత్ స్థాయిలో నిబద్ధులయిన కార్యకర్తలు సైతం పెద్ద సంఖ్యలో ఉండడం బిజెపికి కలసి వస్తోంది.
అదే ఇటీవలి మూడు రాష్ట్రాల్లో గెలుపునకు తోడ్పడింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా స్వయంకృతం వల్ల పోగొట్టు కుంది. అయితే సంస్థాగతం గా బిజెపి బలంగా ఉండడం, మోడీ ఆకర్శణ కారణంగా కాంగ్రెస్ కు పదేళ్లుగా గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రధానంగా నాయకత్వ సమస్య కూడా కాంగ్రెసు కునరాలిల్ల చేస్తోంది. ఈ క్రమంలో రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని ఎలా ఢీకొంటారన్నదానికి స్పష్టత లేదు.
కాంగ్రెస్ లోనే అలాంటి ధైర్యం ఉన్న నేతలు లేరు. అలాగే ధైర్యంగా ముందుకు వెళ్లేలా పటిష్ట నాయకత్వం లేదు. పటిష్ట మైన కార్యకర్తల బలం ఉండడం, సామాజిక మాధ్యమాల ద్వారా ఓటర్లతో నిరంతర సంబంధాలను కలిగి ఉండడం బిజెపికి కలసి వస్తోంది. కార్యకర్తల బలిమితో సమాజంలోని అట్టడుగుస్థాయి ఓటర్లతో కూడా బీజేపీ పటిష్ఠ సంబంధాలను కలిగివుంది.
బలమైన పునాది ఉన్నందువల్ల కొన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా కార్యకర్తల బలం అపారంగా ఉండడం వల్లే ప్రజల్లో నిలదొక్కుకుని ఆయా రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగు తున్నాయి. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం బలహీనపడడంతో అంతర్గత వివాదాల కారణం గా అనేకులు పార్టీని వీడారు. అలా గులాంనబీ అజాద్, కపిల్ సిబల్ లాంటి వారు బయటకు వచ్చారు. రాజస్థాన్లో గెహ్లోత్, పైలట్ల మధ్య అధికార కుమ్మలాటలను నివారించడంలో కాంగ్రెస్ అధిష్ఠానం వైఫల్యం కారణంగానే అక్కడ ఓటమి చెందింది. ఛత్తీస్గఢ్ భూపేష్ బాఘేల్, టిఎస్ సింగ్లోవ్ల మధ్య వివాదాలను పరిష్కరించడంలో కూడా కాంగ్రెస్ నాయకత్వం విఫలమయింది.
అందుకు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించింది. అందుకే మూడు రాష్ట్రాల్లో గెలిచిన తరువాత బీజేపీలో మోదీ ఆరాధన మరింత పెరిగిపోయిం దనడంలో సందేహం లేదు. ఈ విజయాలు, నాయకత్వ పటిమనే బీజేపీని ప్రత్యర్థి పక్షాల కంటే భిన్నంగా నిలబెడుతున్నాయి. కొత్త ముఖ్యమంత్రుల ఎంపికలో బిజెపి అధిష్ఠానవర్గం అధికార దర్పానికి తార్కాణం కావచ్చు.
పాత నాయకులను పక్కన పెట్టడం, కొత్త నేతలకు అవకాశం కల్పించడంలో అనుసరిస్తున్న పద్ధతులు ఆమోదయోగ్యమైన ఫలితాలనిస్తున్నాయి. మరీ ముఖ్యంగా హిందూత్వ స్ఫూర్తిని చక్కగా ఉపయోగించుకోవడం జరుగుతోంది. యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ లాంటి సిఎలు బలంగా ఎదగడానికి విశేషంగా దోహదం చేశాయి. అంతేకాకుండా బీజేపీ తన నాయకత్వ శ్రేణుల్లో క్రమంగా తరం మార్పునకు సంసిద్ధమవుతున్న వైనానికి అవి నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి.
మహా శక్తిమంతమైన బీజేపీ ఎన్నికల యంత్రాంగాన్ని నిలువరించి నిలబడం కూడా కాంగ్రెస్ కు కష్టమే. ఎన్నికలలో పై చేయి సాధించడమనేది కాంగ్రెస్కు అసాధ్యంగా ఉన్నది. బీజేపీకి దీటుగా సొంత సమాంతర ఎన్నికల నిర్వహణ వ్యవస్థ లేకపోవడమేనని చెప్పి తీరాలి. ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో ప్రజలను సమీకరించడంలో బీజేపీ శక్తిసామర్థ్యాలు కాంగ్రెస్ కు అంతుచిక్కకుండా ఉన్నాయి.
ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న తీరు తెన్నులు పూర్తిగా భిన్నమైనవి. ప్రచారఘట్టం తుదిదశలో పార్టీ జాతీయనాయకుల సభలతో ఓటర్లను ఆకట్టుకునే రోజులు గతించాయి. ఓటర్లతో అన్లైన్ ద్వారాగానీ, వాట్సాప్ గ్రూపుల ద్వారాగానీ లేదా విలక్షణ పంథాను అలవర్చుకోవడం ద్వారా బంధాలను పటిష్టం చేసుకుంది. ఇప్పుడు ఎన్నికల వ్యవహారాలలో బిజెపి పటిష్టమైన విధానాన్ని పద్ధతిని కలిగివుంది.
ప్రధాని మోదీ, పోలింగ్ బూత్ స్థాయి బీజేపీ కార్యకర్తలతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించ గలుగుతున్నారు. కార్యకర్తలతో నిరంతర సంస్థాగత సంబంధాలను నెరపడమెలాగో కాంగ్రెస్ నేర్చుకోవలసి ఉంది. దశాబ్ద కాలంగా మోదీ ప్రజాకర్షణ శక్తి బీజేపీకి ఒక స్పష్టమైన, సుస్థిరమైన అనుకూలతను నెల కొల్పింది. ఇందిరాగాంధీ అనంతరం అఖిల భారత స్థాయిలో తిరుగులేని నేతగా వెలుగొందుతూ తన వ్యక్తిగత ప్రభావంతో రాష్ట్రాల ఎన్నికలలో సొంత పార్టీకి గణనీయమైన విజయాలను సాధించిపెడుతున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోదీయే.
ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో ఆయనకు లభ్యమవుతున్న ప్రజాదరణ అనూహ్యం. మోదీ మాటను ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తున్నారు. ఇచ్చిన హామీలను ఆయన తప్పక నెరవేరుస్తారని గట్టిగా నమ్ముతున్నారు. ఈ కారణంగానే ఓటర్లు ఆయన పార్టీని ప్రతీ ఎన్నికలలోనూ బలపరుస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాలపై, ముఖ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలపై స్థానికంగా ఉన్న వ్యతిరేకతను అధిగమించేందుకు మోదీ ప్రభావం అమితంగా దోహదం చేస్తోంది.
ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందన్నది ముఖ్యం. నాయకత్వం పటిష్టంగా లేకపోవడం, పటిష్ట కార్యకర్తల బలం లేకపోవడం వంటివన్నీ లోపాలే. వీటిని అధిగమించి ముందుకు సాగితేనే కాంగ్రెస్ ముందుకు రాగలదు. కేవలం మోడీని తిడుతూ పోతే ఎన్నికల్లో విజయం దక్కదని కాంగ్రెస్, తదితర పార్టీలు గుర్తించాలి.