16-12-2023 RJ
జాతీయం
ఉత్తర్ ప్రదేశ్, (డిసెంబర్ 16): మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఒంటరిగా కనిపిస్తే కామాంధుల చేతిలో బలైపోతున్నారు. దేశవ్యాప్తంగా ప్రతీ రోజు ఎక్కడో చోట ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పోక్సో, ఇతర కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. 2012లో యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశాన్ని కదిపేసిన నిర్భయ తరహా సంఘటన మరోసారి రిపీట్ అయింది.
ఉత్తర్ ప్రదేశ్ నుంచి జైపూర్ వెళ్తున్న బస్సులో 20 ఏళ్ల దళిత యువతిపై ఇద్దరు డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. డిసెంబర్ 9 -10వ తేదీ మధ్య రాత్రి యూపీ నుంచి రాజస్థాన్ లోని జైపూర్ వెళ్లే ప్రైవేట్ బస్సులో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. కాన్పూర్ నుంచి జైపూర్ బస్సులో బాధితురాలు క్యాబిన్లో కూర్చున్నట్లు పోలీసులు చెప్పారు. క్యాబిన్ లో ఉన్న ఆరిఫ్, లలిత్ అనే ఇద్దరు డ్రైవర్లు ఆమెపై అత్యాచారం చేశారు. ఈ కేసులో ఆరిఫ్ ని అరెస్ట్ చేశామని, ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడని కనోటా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ భగవాన్ సహాయ్ మీనా తెలిపారు.
మరో నిందితుతు లలిత్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. క్యాబిన్ లోపల బాధితురాలు ఉండగా.. బస్సులో మరికొందరు ప్రయాణికులు ఉన్నారని, క్యాబిన్ లోపలి నుంచి మూసేసి ఉందని, అయితే ఘటన సమయంలో మహిళ కాపాడాలని కోరడంతో ప్రయాణికలు అప్రమత్తమయ్యారు. దీంతో వారు బస్సును ఆపేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఆరిఫ్ ప్రయాణికులకు చిక్కగా.. లలిత్ తప్పించుకున్నాడు.