16-12-2023 RJ
జాతీయం
న్యూఢిల్లీ, (డిసెంబర్16): అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖీ సంభాషించారు. 'మోదీ గ్యారెంటీ వెహికల్' దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి చేరాలని ఆయన ఆకాంక్షించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో 'వికాస్ సంకల్ప్ యాత్ర'ను మోదీ జెండా ఊపి ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వాలు వికసిత్ భారత్ సంకలను ప్రమోట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంగా చేపట్టిన మోదీ గ్యారెంటీ వెహికల్ దేశంలోని ప్రతి ప్రాంతానికి చేరాలని తాము కృతనిశ్చయంతో ఉన్నట్టు ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. కేవలం నెల రోజుల్లోనే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర వేలాది గ్రామాలు, 1,500 సిటీలకు చేరినట్టు తెలిపారు.
అభివృద్ధి చెందిన భారత్ సాధనలో మన సిటీలు కీలక భూమిక పోషిస్తున్నాయని చెప్పారు. స్వాతంత్య్రానంతరం చాలాకాలం వరకూ కొన్ని పెద్ద సిటీలు మాత్రమే అభివృద్ధిని చూరగొన్నాయని, ఈరోజు టైర్-2, 3 సిటీలపై కూడా తాము దృష్టి సారించామని చెప్పారు. అమృత్ మిషన్ లేదా స్మార్ట్ సిటీ మిషన్ ద్వారా చిన్న నగరాల్లో సైతం కనీస వసతులను మెరుగపరుస్తున్నామని, నీటి సరఫరా, డ్రైనేజ్, మురుగునీరు సిస్టమ్, ట్రాఫిక్ సిస్టమ్, సీసీటీవీ నెట్వర్క్ నిరంతరంగా అప్లోడ్ చేస్తున్నామన్నారు. స్వచ్ఛత, పబ్లిక్ టాయిలెట్లు, ఎస్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా సులభతర వాణిజ్యం సాధ్యమై జీవనవిధానం సులభతరమవుతుందని చెప్పారు.
తమ ప్రభుత్వం పేదలు, రైతులు, చిన్న వ్యాపారాలు, సమాజంలోని ఇతర వర్గాలకు అండగా నిలుస్తోందన్నారు. కాగా, శనివారం నాడు ఐదు రాష్ట్రాల్లో మోదీ ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. నిర్దిష్ట కాలవ్యవధిలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల ప్రయోజనాలు లబ్దిదారులందరికీ చేరాలనే సంకల్పంతో వికసిత్ సంకల్ప్ యాత్రను కేంద్రం దేశవ్యాప్తంగా చేపడుతోంది.