20-12-2023 RJ
జాతీయం
జాతీయం, (డిసెంబర్ 20): మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పదేళ్లలో ఇచ్చిన హామీలను అమలు చేసామా లేదా అన్నది సమీక్షించుకునే సమయం ఆసన్నమైంది. పార్లమెంటులో సభ్యులను మూకుమ్మడిగా సస్పెండ్ చేయడమన్నది నిరంకుశ విధానాలకు పరాకాష్టగా చూడాలి. సమస్యలపై చర్చించాలన్న సంకల్పం లోపించింది. అవినీతి మరక అంటకుండా మోదీ దేశాన్ని పాలించారన్న ప్రశంసలు ఉన్నా.. ఆదానీ, అంబానీలకు, ఇతర కార్పోరేట్లకు దోచిపెట్టారన్న విమర్శలు ఉన్నాయి. పార్లమెంటులో చర్చలేకుండా చేయాలన్న సంకల్పం సరికాదు. అంశం ఏదైనా, సందర్భం ఏదైనా చర్చకు అధికారపక్షం ఎప్పుడూ సిద్దంగా ఉండాలి.
అప్పుడే దేశంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. కానీ దానిని పక్కన పెట్టి కేవలం విపక్షాలది రాజకీయం అంటూ 141 మంది ఎంపిలను సభనుంచి బయటకు పంపి ఏం సాధిస్తారో చెప్పాలి. వారంతా ప్రజలతో ఎన్నికైన ప్రతినిధులుగా గుర్తించకపోవడం దారుణం. ఇది పాలకపక్షం అహంకారానికి పరాకాష్టగానే చూడాలి. ఓ రకంగా కాంగ్రెస్ తరహా రాజకీయాలకు పెద్ద ఎత్తున తెరతీసారు. తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేలా మోడీ రాజకీయాలు చేస్తున్నారు. అయితే పాలనలో మాత్రం అంతగా దూసుకుని పోవడం లేదు.
ప్రధానంగా నోట్లరద్దు, జిఎస్టీతో ప్రజలకున్న ఆశలు అడియాశలయ్యాయి. ప్రధానంగా ధరల పెరగుదల విషయంలో పట్టింపు లేకుండా పోయాయి. ఆహారధాన్యాలు ఉత్పత్తి అవుతున్నా వాటికి ధరలు దక్కడం లేదు. గోదాముల్లో ధాన్యం మగ్గుతున్న బయటకు రావడం లేదు. అలాగే దిగుమతులు కూడా తగ్గడం లేదు. కాంగ్రెస్ తరహా రాజకీయాలు చేస్తున్నారే తప్ప ఆదర్శ రాజకీయాలకు పెట్టింది పేరయిన బిజెపి ఇప్పుడా ముసుగు నుంచి బయటపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠ మసకబారినా, ప్రధానంగా బిజెపికి రాజకీయాలకు చెరగని మచ్చని తెచ్చిపెట్టాయి.
పాలన ఎలా ఉన్నా అవినీతి రహితంగా సాగుతుందన్న పేరు ప్రచారం చేసుకోవడం మినహా ఇతర విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. అవినీతి లేకున్నా అక్రమ రాజకీయాలు సాగుతూనే ఉన్నాయి. అమిత్, మోడీ ద్వయం రాష్ట్రాల్లో చిచ్చు పెట్టి సఫలం అయ్యారు. కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యంగా చేస్తున్న రాజకీయాలు ఒక్కోసారి వెగటుగా ఉంటాయనడానికి ఇటీవలి పరిణామాలు ఉదాహరణగా చెప్పుకోవాలి.
కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే క్రమంలో చేస్తున్న పనులన్నీ దేశహితం కోసమేనని సరిపెట్టుకోలేం. అలాగే గతంలో మీరు చేయలేదా అని ఎదురుదాడి చేయడం ఇటీవల అలవాటయ్యింది. మిగతా నాయకులకు, మిగతా పార్టీలకు, భారతీయ జనతా పార్టీకి చెందిన మోదీ, షాలకు కూడా పెద్దగా తేడా ఉండడం లేదని ప్రజలు గుర్తించారు. ఈ క్రమంలోనే తప్పటడుగులు వేస్తున్నారు. దేశమంతటా అన్ని రాష్ట్రాలలో భారతీయ జనతాపార్టీపతాకం రెపరెపలాడా లన్నది ఈ ఇరువురి నాయకుల కోరికగా ఉంది. గతంలో అధికారంలోకి వచ్చిన
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా అనేక అడ్డదారులు తొక్కింది. రాష్ట్రాలలో అధికారం నిలబెట్టుకోవడం కోసం లేదా అధికారంలో ఉన్న ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చడం కోసం కాంగ్రెస్ పార్టీ చేయని అరాచకం లేదు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపైకి ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి సంస్థలను ప్రయోగించి నానా ఇబ్బందులు పెట్టారు. సీబీఐ విచారణలు జరిపించారు. ఇప్పుడు కాంగ్రెస్ అడుగుజాడలలో అదే నరేంద్ర మోదీ, అవే ఏజెన్సీలను కాంగ్రెస్ నాయకుల మీదకు ప్రయోగిస్తున్నారు.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో గానీ, ప్రభుత్వ ఏజెన్సీలను దుర్వినియోగం చేయడంలో గానీ కాంగ్రెస్ ఎప్పుడూ ముందుండేది. ఇప్పుడు అదే పంథాను బిజెపి అనుసరిస్తోంది. మొత్తంగా బిజెపి కాంగ్రెస్ కన్నా భిన్నంగా ఉండలేకపోతోంది. ఇకపోతే ప్రధాన సమస్యలపై దృష్టి సారించడం లేదు. రూపాయి విలువ పడిపోతున్నా పైకి లేపడం లేదు. ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా తయారయ్యింది. నిత్యావసరాల ధరలు, ఉల్లిగడ్డ ధరలు, బియ్యం ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. ఈ క్రమంలో దేశంమే కాదు.. రాష్ట్రాలు కూడా అప్పులు ఊబిలో కూరుకుపోతున్నాయి. రాష్ట్రాలను కంట్రోల్ చేయాల్సిన కేంద్రం కూడా ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ దేశాన్ని అగాథంలోకి నెడుతుంది.
రాష్ట్రాలను అజమాయిషీ చేయాల్సిన కేంద్రం చేతులెత్తేస్తోంది. కేంద్రం కూడా అదే దారిలో నడిస్తే మరి ప్రశ్నించే వారు ఎవ్వరన్నదే ఇప్పుడు ప్రశ్న. ఇలా ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్నా దేశంలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. ధరలు దిగి రావడం లేదు. జిఎస్టీ వాతలు తగ్గడం లేదు. గ్యాస్, పెట్రో ధరలు తగ్గలేదు. నిరుద్యోగం పెరుగుతూనే ఉంది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతు న్నాయి. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మేస్తున్నారు. అయినా ఈ డబ్బు ఎక్కడికి పోతుందన్నది తెలియాలి. దీనిపై సమగ్ర చర్చ చేయాలి. రాష్ట్రాలు చేస్తున్న అప్పులతో పాటు.. కేంద్రం చేస్తున్న అప్పుల పైనా చర్చించాలి.
ఇలా పాలకులు ప్రజలను మభ్యపెడుతూ పోతుంటే నష్టపోయేది ప్రజలే. అందువల్ల దీనిపై పార్లమెంట్ ప్రత్యేకంగా చర్చించాలి. కానీ ఎలాంటి చర్చలకు అక్కడ స్థానం లేకుండా పోయింది. అధికారం అప్పగించాం కదా అని ఇష్టారీతిన అప్పులు చేస్తే కట్టేది ఎవరు. జిఎస్టీ వసూళ్లు లక్షా 40 వేల కోట్లకుచేరినా అప్పులు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తోంది. కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ అప్పులు పెరిగిపోతున్నాయి. నిజానికి ఇంతగా అప్పులు చేసి ఏం చేస్తున్నారన్న దానిపైనా వివరణ రావాల్సి ఉంది. ప్రజలు కూడా పాలకులను అప్పులపై నిలదీయాలి. అలాగే అప్పులపై అజమాయిషీ ఉండాల్సిందే. కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేంద్ర, రాష్ట్రాలు అన్న తేడా లేకుండా అప్పులు పెరుగుతున్నాయి.
మరోవైపు ఆర్థికంగా రాష్ట్రాలను బలహీనపరిచి వాటి అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా ను తగ్గిస్తున్నారు. సామాన్యుల పై అదనపు పన్నులు మోపుతూ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీస్తున్నారు. సెస్సుల రూపంలో సింహభాగం నిధులను కేంద్ర ఖజానాకు మళ్లించుకుపోతున్నారు. మోదీ సర్కార్ పెట్రోల్, డీజిల్ పై సెస్సులను అడ్డగోలుగా పెంచి రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసింది. ప్రజలు చెల్లిస్తున్న అన్ని పన్నులకు అదనంగా కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ప్రత్యేక పన్నునే సెస్ అంటారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పెట్రోలియం, రహదారులు, మౌలిక సదుపాయాలు, ఎగుమతులు తదితర రంగాల్లో కేంద్రం ఇలా సెస్ వసూలు చేస్తున్నది. సెస్సును ఏ రంగంలో వసూలు చేస్తే ఆ మొత్తాన్ని ఆ రంగం అభివృద్ధికే వెచ్చించాలి.
ఇతర రంగాలకు బదిలీ చేయరాదు. దీనికి భిన్నంగా మోదీ సర్కారు సెస్సుల రూపంలో వసూలు చేస్తున్న నిధులన్నీ పక్కదారి పట్టిస్తున్నది. ఈ నిధులన్నీ ఏమవుతున్నాయో తేలాల్సి ఉంది. అలాగే రాష్ట్రాలు కూడా ఉచిత పథకాల పేరుతో చేస్తున్న పందేరాలను కూడా నిలదీయా ల్సిందే. ఇలా ఎంతకాలం సాగిస్తారన్నది కూడా ముఖ్యమే.