21-12-2023 RJ
జాతీయం
న్యూఢిల్లీ, (డిసెంబర్ 21): కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ విపక్ష ఇండియా కూటమి విభేదాలను పక్కన పెట్టి ఒక్కటిగా ముందుకు సాగుతున్నాయి. పార్లమెంటులో జరుగుతున్న ప్రతిష్టంభనను మోడీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. సమస్య ఏదైనా చర్చించడం లేదు. ఈ క్రమంలో మోడీ విధానాలపై విపక్షలు సమరశంఖం పూరిస్తున్న వేళ మోడీ ద్వయం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ప్రజల నడ్డి విరిచేలా చేస్తున్నా.. ఇంతకాలం వాటిని సమీక్షించు కోవడం లేదు.
ప్రజలకు బాధలు తీర్చే పార్టీ కావాలి తప్ప .. పార్టీ ఏదన్నది ముఖ్యం కాదని తెలంగాణ, కర్నాటక ఎన్నికలు రుజువు చేశాయి. అయినా కిందిస్థాయిలో ఏం జరుగుతందో బిజెపి పాలకులు తెలుసుకోలేక పోతున్నారు. తెలంగాణలో కూడా ఇలాంటి అహంకారంతోనే కెసిఆర్ అధికారం కోల్పోయారు. కేవలం రామమందిరం, కాశీ, మధురలను, కాశ్మీర్ ను చూపి ఎంతోకాలం ఓట్లు కొల్లగొట్టలేమని కూడా పాలకులు గుర్తించాలి. అవన్నీ పరిష్కరించదగ్గ సమస్యలే అయినా... ప్రజలకు భారంగ మారిన ఆర్థిక విధానాలపై తోణం సమీక్షించుకోవాల్సి ఉంది.
లేకుంటే రేపటి ఎన్నికల్లో మోడీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడం ఖాయం. ప్రజల జీవన స్థితిగతులను పట్టించు కోవడం లేదు. మోడీ విధానాలను ప్రజలు అమోగించారని అందుకే మూడు రాష్ట్రాల్లో భారీ మెజార్టీతో గెలిపించారని చెప్పుకోవడం ఆత్మవంచన తప్ప మరోటి కాదు. సంస్కరణలు ప్రజలు ఆమోదిస్తే కర్నాటక, తెలంగాణ ఓటముల గురించి కూడా చెప్పాలి. రాష్ట్రస్థాయిలో బలమైన నాయకులు లేక బలహీనంగా ఉన్నప్పటికీ గట్టి పోటీ ఇచ్చి సీట్ల సంఖ్యను పెంచుకున్న కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించారంటే కేవలం మోడీ పాలనపై ఉన్న వ్యతిరేకతతోనే అని బిజెపి నేతాగణం అలోచన చేయాలి.
ఈ ఎన్నికలు నిస్సందేహంగా జాతీయ రాజకీయాలపై, మోదీ ప్రభుత్వ పరిపాలనపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటక, తెలంగాణల్లో వచ్చిన ఫలితాల ప్రభావం రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుందనడంలో సందేహం లేదు. అలాగే పార్లమెంటులో సస్పెన్షన్ల పర్వంపై విపక్ష ఇండియా కూటమి ఆందోళన ప్రారంభించింది. నిజానికి సమస్యలు చర్చించ కుండా ఆందోళన చేస్తున్న వారిని సస్పెండ్ చేయడం దారుణం కాక మరోటి కాదు. ప్రధాని మోడీ ఛరిష్మా, పాలనా సంస్కరణలు బాగా ఉంటే ఎందుకు సమస్యలపై వెనకాడుతున్నారో చెప్పాలి.
కేవలం కాంగ్రెసు, విపక్షాలను తిట్టిపోస్తూ రాజకీయం చేయడమే పాలన కాదు. పాలనలో కొత్త ఒరవడి సృష్టించాలి. ప్రజలకు మేలు జరిగేల సంస్కరణలు ఉండాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. ఆహార ధాన్యాల ధరలు తగ్గాలి. కానీ అలా జరగడం లేదు. బియ్యం ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. ఎక్కడ తప్పిదం జరిగిందో పరిశీలన చేయాలి. కేవలం కార్పోరేట్ శక్తులు బలపడుతున్న తీరు ప్రజలను కలచి వేస్తోంది. పేద, సామాన్య ప్రజలు ఎంతగా చితికి పోతున్నారో గమనించడం లేదు. జిఎస్టీ కారణంగా వస్తువుల ధరలు పెరిగితే ఎవరికి నష్టమో ఎందుకు ఆలోచన చేయడం లేదు.
దేనిని వదలకుండా జిఎస్టీ పరిధిలోకి తీసుకుని వచ్చినంత మాత్రాన, ప్రభుత్వ ఆదాయం పెరిగినంత మాత్రాన ఆర్థిక సంస్కరణలు భేషుగ్గా ఉన్నాయంటే ఎవరిని వంచించడానికి అన్నది ఆలోచన చేయాలి. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్న చందంగా మోడీ ఉన్నారే తప్ప ఫలితాలను విశ్లేషించుకుని తప్పులను సరిదిద్దుకుంటామని ప్రకటించడంలేదు. ప్రజలకు గుజరాత్ మోడల్ అంటూ ప్రచారం చేసి, ప్రధాని పదవిని చేపట్టిన మోడీపై ప్రజలకు పరిస్థితులు ఇంత అధ్వాన్నంగా ఎందుకు ఉంటాయి. ప్రజల్లో నివురుగప్పిన అసంతృప్తిని గమనించి సర్దుకోకపోతే వాత తప్పదని ప్రజలు కొద్దిగా రుచి చూపారు.
పేరుకు రాష్ట్ర ఎన్నికలే అయినా ప్రధాని మోదీ విపరీతంగా కష్ట పడాల్సి వచ్చింది. ప్రధాని తన వ్యక్తిగత ప్రతిష్ఠను పణంగా పెట్టి ప్రచారం చేశారు. అయినా తెలంగాణలో మోడీ ప్రయత్నాలు ఫలించలేదు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రం చేజారిపోలేదనే సంతృప్తి మాత్రమే మిగిలింది తప్ప, ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి ని తొలగించ లేకపోతున్నామని గమనించాలి. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ధరలను, నేటి మార్కెట్ ధరలను ఎందుకు బేరీజు వేసుకో వడం లేదో ప్రధాని మోడీ ప్రజలకు సమాధానం చెప్పాలి. రూపాయి బలహీనత కూడా ఇందుకు కారణంగా చూడాలి. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నా, గట్టిగా పోటీ పడలేకపోయినా ప్రజల ఆలోచనలు కాంగ్రెస్ వైపు మళ్లేలా చేసింది ప్రధాని మోడీ అని గుర్తించాలి.
ఇకముందు కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి ఎదురవుతుందని భావించాలి. దానికి కాంగ్రెస్ గొప్పతనం కాకుండా మోడీ అనుసరిస్తున్న పిడివాద సంస్కరణల ఫలితమని గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంద నడానికి తాజా పార్లమెంట్ ఘటనలే ప్రత్యక్ష నిదర్శనం. విపక్ష పార్టీలు కూడా విభేదాలు పక్కన పెట్టి ముందుకు నడుస్తున్నాయి. విమర్శలను హెచ్చరికగా తీసుకుని ముందుకు సాగితే తప్ప మనలేమని మిత్రద్వయం గుర్తించి ప్రజలకు మేలుచేసే సంస్కరణలను అమలు చేయాలి. అప్పుడే బిజెపి తన అస్తిత్వాన్ని నిలుపుకోగలదు.