21-12-2023 RJ
జాతీయం
న్యూఢిల్లీ, (డిసెంబర్ 21): అత్యంత వివాదాస్పదమైన సీఈసీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల నియామక బిల్లుకు గురువారం లోక్ సభ ఆమోదం తెలిపింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనరల్ నియామకం, సర్వీస్, పదవీకాలం నియంత్రించే బిల్లును ఇప్పటికే రాజ్యసభ ఆమోదించింది. 2023 మార్చిలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్ సలహామేరకు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చేవరకు ఈ తీర్పు మంచిదని కోర్టు అభిప్రాయపడింది.
డిసెంబర్ ప్రారంభంలో ప్రతిపక్షాలు వాకౌట్ చేసినప్పటికీ రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించింది. భారత ఎన్నికల సంఘంలోని ముగ్గురు కీలక సభ్యుల నియామకానికి సంబంధించిన విధివిధానాలను ఏర్పాటు చేయడం ఈ బిల్లు లక్ష్యం. కొత్త చట్టం ప్రకారం.. సీఈసీ, ఇతర ఈసీలను ఎంపిక చేసే ప్యానెల్ లో ప్రధాన న్యాయమూర్తికి బదులుగా కేంద్ర మంత్రిని నియమించింది. అయితే ఈ కొత్త చట్టంలో అత్యున్నత పోల్ అధికారుల నియామకంపై ప్రభుత్వానికి అధిక అధికారాలను ఇస్తుందని.. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిపై ప్రభావం చూపుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.