23-12-2023 RJ
జాతీయం
కరోనా ముప్పు తొలగిపోలేదని తాజా ఘటనలతో మరోమారు రుజువు అవుతోంది. కొత్త వైరస్ వణికి స్తోంది. దీంతో మనదేశం కూడా అప్రమత్తం కాక తప్పలేదు. ప్రజలకు మళ్లీ హెచ్చరికలు చేయక తప్పడంలేదు. కేరళలో ఇప్పటికే వైరస్ తీవ్రత మొదలయ్యింది. తమిళనాడులో కూడా కొన్ని కేసులు వచ్చాయి. హైదరాబాద్ నీలోఫర్ లో చిన్నారికి, భూపాలపల్లి జిల్లాలో ఓ మహిళకు కరోనా ఉన్నట్లు గుర్తించారు. భారత్లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో కొత్తగా 756 కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కి పెరిగింది. గత ఏడు నెలల్లో కేసుల సంఖ్య ఇంత చేరడం ఇదే తొలిసారి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడానికి కొత్త వేరియంట్ జేఎన్.1 కారణమని తెలుస్తోంది. ఇక గత 24 గంటల వ్యవధిలో మహమ్మారి కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
కేరళలో ఇద్దరు కాగా, రాజస్థాన్, కర్ణాటకలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,332కి ఎగబాకింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4.50 కోట్లకు చేరింది. మహమ్మారి నుంచి 4,44,71,212 మంది కోలుకున్నారు. ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.81 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,79,081) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. అయితే కొత్త వేరియంట్ ప్రభావం చూపుతున్న క్రమంలో జాగ్రత్తలు అవసరమని హెచ్చరించింది. పండగలతో పాటు, చలి పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఇప్పటికే పలు రాష్ట్రాలను హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా జెఎన్-1 కొత్త వేరియంట్ లక్షణాలున్న వారిని గుర్తించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, జాగ్రత్తలు పాటించడం మళ్లీ అలవాటు చేసుకోవాల్సిన అసవరం పెరిగింది. చలి పెరగడంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.
వాతావరణ మార్పుల కారణంగా కూడా అనేక రుగ్మతలు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాల నేపథ్యంలో మళ్లీ ఆంక్షల్లోకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఆంక్షలు విధించడం మొదలు పెట్టాయి.