25-12-2023 RJ
జాతీయం
న్యూఢిల్లీ, (డిసెంబర్ 25): లోక్ సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. మొననటి అసెంబ్లీలో 8 సీట్లు సాధించడంతో పాటు, ఓట్ల శాతం పెరగడంతో బిజెపిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువ సీట్లు సాధించడంపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఈనెల 28వ తేదీన కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్లో పార్లమెంట్ ఎన్నికలపై అమిత్ షా సమావేశం నిర్వహించనున్నారు. మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షుడు వరకు 1200 మందితో భేటీ కానున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే రోజు అసెంబ్లీలో బీజేపీ శాసనసభ పక్ష నేతను నిర్ణయించనున్నారు. తెలంగాణా రాష్ట్రంలో పన్నెండు పార్లమెంట్ సీట్లు గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. గత లోక్ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచింది.
ఇదే ఊపుతో పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సీనియర్లు కిషన్ రెడ్డి, డీకే అరుణ, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, జితేందర్ రెడ్డి, చాడా సురేష్ రెడ్డి, కొండా, బూర నర్సయ్య గౌడ్ తదితరులు సిద్ధమవుతున్నారు.